జీఎస్టీ డెడ్లైన్ వాయిదా పడింది!
జీఎస్టీ డెడ్లైన్ వాయిదా పడింది!
Published Mon, Jan 16 2017 6:53 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ అమలు తేదీ వాయిదా పడింది. జీఎస్టీ అమలును 2017 జూలై 1కు వాయిదా వేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పన్ను అధికారాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనందున్న ఈ అమలు తేదీని వాయిదా వేస్తున్నట్టు జైట్లీ తెలిపారు. జీఎస్టీ అమలు తేదీపై నేడు సమావేశమైన అరుణ్ జైట్లీ నేతృత్వంలోని కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తదుపరి మీటింగ్ ఫిబ్రవరి 18న జరుగనుంది.
వార్షిక టర్నోవర్ 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంపై కేంద్రం సుముఖంగా లేనప్పటికీ, ఆఖరికి 90 శాతం హక్కులు రాష్ట్రాలకు, 10 శాతం కేంద్రానికి ఉంటాయని అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.1.5 కోట్లకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్ర, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉండనున్నట్టు చెప్పారు.
అయితే పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు ఈ విషయంలో వాదిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో తమ రెవెన్యూలు భారీగా కోల్పోతామని పేర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు కూడా తమ రెవెన్యూలకు గండికొడుతున్నాయని చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో కేంద్రం చెల్లించే నష్టపరిహారాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
Advertisement
Advertisement