విదేశీయులకు కిక్కిచ్చి స్థానికులను జైలుకి..
విదేశీయులకు కిక్కిచ్చి స్థానికులను జైలుకి..
Published Sat, Dec 17 2016 9:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
ఆరు దశాబ్దాలుగా మద్య నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్న గుజరాత్ రాష్ట్రం ఆ నిషేధ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. మద్యం నిషేధ చట్టాలను కఠినతరం చేసేందుకు తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ను కూడా ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ కింద ఎవరైనా స్థానికులు లిక్కర్ బాటిళ్లతో దొరికినా, అమ్మినట్టు తెలిసినా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు సిద్ధమైంది. అయితే ఈ కఠినమైన నిబంధనలు కేవలం స్థానికులకు మాత్రమేనట. విదేశీయులకు, సందర్శకులకు మాత్రం ఫుల్ కిక్కిచ్చేలా ఆల్కాహాల్ను అందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది.
ఈ ఆర్డినెన్స్ను ప్రస్తుతం గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతమున్న నిషేధ చట్టంలో ఆల్కాహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా కేవలం మూడేళ్ల జైలు శిక్ష విధించేవారు. ఆల్కాహాల్ సేవించి ఏదైనా గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తే వారికి ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షపడేది. కానీ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి మరింత కఠినంగా శిక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ రూపాణి ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. ఓబీసీలు, పటేదార్లు రెండు కమ్యూనిటీ డిమాండ్ల నేపథ్యంలో తలమునకలవుతున్న అధికార పార్టీ ఎన్నికల్లో నెగ్గేందుకు ఎలాగైనా పట్టుసాధించాలని దృష్టిసారిస్తోంది. మహిళల ఓట్లు తమ బ్యాలెట్లోనే పడేలా చూసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకుంటోంది. ఓబీసీ కమ్యూనిటీ నేత అల్పేష్ థాకోర్ సైతం ఎస్సీ, ఎస్టీలకు మద్దతిస్తూ కఠినతరమైన నిషేధ చట్టాన్ని మంచిగా అమలుచేయాలని పిలుపునిచ్చారు.
అయితే వరల్డ్ క్లాస్ బిజినెస్ ఈవెంట్లకు మాత్రం సౌలభ్యమిచ్చేలా ఈ నిషేధ చట్ట ఆర్డినెన్స్ను తీసుకొస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే విదేశీయులకు సౌకర్యవంతంగా ఉండేలా మద్య నిషేధ పాలసీ అమలుచేయాలని ఆ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ సూచించింది. ఈ మేరకు విదేశీయులకు కిక్కిచ్చేలా, స్థానికులకు మాత్రమే నిషేధ చట్టాన్ని కఠినతరం చేశారు.
Advertisement
Advertisement