- పంజాబ్, హరియాణాలో క్షణక్షణం ఉత్కంఠ
- రెండు రాష్ట్రాల్లోనూ హై అలర్ట్
-
వారణాసిలో గుర్మీత్‌కు వ్యతిరేకంగా సాధువుల నిరసన
సాక్షి, పంజాబ్, హరియాణా: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (50)కు మరికాసేపట్లో శిక్ష పడనున్న నేపథ్యంలో పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పోలీసుల నిఘా నీడలో గడుపుతున్నాయి. డేరా మద్దతుదారులను ఎదుర్కొనేందుకు అడుగడుగునా పోలీసులు, భద్రతాదళాలు భారీగా మోహరించారు. బలగాల కవాతు నిర్వహిస్తూ.. ప్రజలు శాంతియుతంగా, సంయమనంతో ఉండాలని, వీధుల్లోకి, రోడ్లమీదకు రావొద్దని పిలుపునిస్తున్నారు.
ఇక గుర్మీత్ జైలులో ఉన్న రోహతక్‌లో బలగాలు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీచేశారు. రోహతక్ జైలుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్న సీబీఐ జడ్జీ కారాగారంలోనే గుర్మీత్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో రోహతక్ పూర్తిగా భద్రతా దళాల చేతుల్లోకి వెళ్లింది. పంజాబ్, హరియాణాలోని చాలా పట్టణాలు, నగరాల్లోనూ భద్రతా దళాలు, పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తూ..పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. మరోవైపు గుర్మీత్ రాంరహీం సింగ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యున్నత భద్రతా సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, కేంద్ర హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో పంజాబ్, హరియాణాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు.
'గుర్మీత్‌ను ఉరితీయాలి'
అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రాంరహీం సింగ్‌పై హిందూ సాధువులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్మీత్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిలో సాధువులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుర్మీత్‌ను ఉరితీయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.