'ముందు బాబును నిలదీయండి'
సిద్దిపేట జోన్(మెదక్ జిల్లా): కరవు యాత్ర పేరిట తెలంగాణలో తిరిగే టీడీపీ నేతలు ముందుగా ఈ ప్రాంత ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబును నిలదీయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కరవు పరిస్థితిపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు.
పాలమూరు, డిండి ప్రాజెక్టులను అడ్డుకునే క్రమంలో ఢిల్లీకి లేఖలు రాసిన బాబును ప్రశ్నించాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ ప్రాంత టీడీపీ నేతలు విజయవాడకు యాత్ర నిర్వహించి చంద్రబాబును నిలదీస్తే బాగుంటుందని హితవు పలికారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కరవును పారదోలేందుకు ముఖ్యమంత్రి కేపీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి శాశ్వతంగా కరవు నివారణకు చర్యలు చేపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.