సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘నాడు వ్యవసాయానికి కరెంట్ దండగ అన్న చంద్రబాబు గతి ఏమైందో.. నేడు సాగుకు మూడు గంటల కరెంటు చాలంటున్న ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డికి కూడా అదే గతి పడుతుంది.. ఈ రోజు కాకుంటే రేపు ఆయన జైలుకు పోక తప్పదు..’’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోస్గి, మక్తల్, దేవరకద్ర, కొత్తకోటలలో ఆయన పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘టీడీపీ డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి.. తప్పించుకునేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. రేవంత్‌రెడ్డి నువ్వు చేసింది తప్పు, విచారణ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయి. ఈ రోజు కాకుంటే రేపు.. రేపు లేదంటే ఎల్లుండి అయినా జైలు తప్పదు..’’ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోమారు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు
రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదని, కాంగ్రెస్ గెలిచేది లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీలో ఒక మాట, తెలంగాణకు వస్తే మరో మాట మాట్లా డుతారని హరీశ్ విమర్శించారు. మహారాష్ట్రలో తగిన చికిత్స అందక, మందుల్లేక 34 మంది పిల్లలు చని పోయినట్టు టీవీల్లో చూశామని.. మరి బీజేపీ సర్కా రు ఏం చేస్తోందని ప్రశ్నించారు.
పక్కనే ఉన్న కర్ణాట కలో పేదింటి ఆడబిడ్డకు సాయం అందించని కాంగ్రెస్.. తెలంగాణలో ఏదో చేస్తామంటూ చెప్పే మాటలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నా రు. అదే తెలంగాణలో కేసీఆర్ మాటంటే మాటేనని.. మొ దట్లో పింఛన్‌ను రూ.200 నుంచి వెయ్యి చేస్తామని చేశారని, తర్వాత రెండు వేలకు పెంచారని హరీశ్ చెప్పారు. అక్టోబర్ 16న సీఎం కేసీఆర్ వరంగల్ బహిరంగ సభలో వెల్లడించే మేనిఫెస్టో చూస్తే ప్రతి పక్షాల మైండ్ బ్లాంక్ అవుతుందని చెప్పారు.
ఎన్నికల కోసమే ట్రిబ్యునల్
తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని ప్రధానిని కోరినా.. పదిసార్లకుపైగా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా, లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పుడు కృష్ణా జలాల అంశాన్ని ట్రిబ్యునల్‌కు అప్పగిస్తున్నట్టు ప్రకటించడం ఎన్నికల జిమ్మిక్కేనని, తెలంగాణపై మోదీకి, బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment