సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిజమైన వారసుడు. ఆయన వ్యవసాయం దండుగ అంటే ఈయన మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడు’’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు, రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలా తయారయిందన్నారు.
మూడుగంటల కరెంటు రైతులకు చాలు అని దొరికిపోయి కుడితిలో పడ్డ ఎలుకలా, నాలుక కొరుక్కుంటూ బుకాయించడానికి రేవంత్ అడ్డం పొడుగు మాట్లాడుతూ రోజుకింత అభాసు పాలవుతున్నాడని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
ఎవరి పాలన బాగుందో చూసి ఓట్లడుగుదాం
గతంలో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా? తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో బాగుందా? ఎవరి పాలనలో బాగుందో చూసి ఓట్లేయాలని ప్రజలను ఓట్లు అడుగుదాం.’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కరెంటు మీద ఎంత చర్చ జరిగితే బీఆర్‌ఎస్‌కు అంత మేలని అభిప్రాయపడ్డారు.
‘నాడు లోక కల్యాణం కోసం రుషులు యజ్ఞాలు చేస్తే రాక్షసులు భగ్నం చేసేవారు. ఇప్పుడు కేసీఆర్ ఓ రుషిలాగా రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే కాంగ్రెస్ వాళ్లు భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు.’అని నిందించారు.
అసలు రాష్ట్రంలో కేసీఆర్‌కు పోటీ ఉంటుందా?
కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని రేవంత్ అంటున్నాడని, అసలు రాష్ట్రంలో కేసీఆర్‌కు పోటీ ఉంటుందా అని హరీశ్ ప్రశ్నించారు. కేసీఆర్‌ఎక్కడ పోటీ చేసినా రాష్ట్ర ప్రజలు కళ్లకు అద్దుకుని గెలిపించారని, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, కరీంనగర్, గజ్వేల్‌లలో కేసీఆర్‌ను గెలిపించారని గుర్తు చేశారు.
కేసీఆర్ తమ దగ్గర పోటీ చేస్తే బాగుండని, ఊరు, నియోజకవర్గం, జిల్లా బాగుపడతాయని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రేవంత్ సెన్సేషన్ కోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కరెంటు గురించి రేవంత్ మాటలు విని ఆ పార్టీ నాయకులే తిట్టుకుంటున్నారని చెప్పారు. రేవంత్ మాటల పర్యవసానంగానే కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment