ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
వాషింగ్టన్: జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్ల (32)ను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ కుచిభోట్ల హత్యను తీవ్రంగా ఖండించారు. దేశంలో మతిలేని హింసకు తావులేదని తేల్చిచెప్పారు.
'కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా బాధ కలిగించింది. బాధితుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరముంది' అని భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్ కమల్ హారిస్ ట్వీట్ చేశారు.
'కాన్సాస్ కాల్పులతో ఛిన్నాభిన్నమైన కుటుంబం గురించే నేను మథనపడుతున్నా. మతిలేని హింసకు మన దేశంలో తావులేదు. జరిగిన ఘోరంతో నా గుండె పగిలింది' అని కాంగ్రెస్‌వుమెన్ పరిమళ జయపాల్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయురాలిగా పరిమళ జయపాల్ నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి దేశంలో విద్వేష నేరాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సాస్ నగరంలో జరిగిన కాల్పులను ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. ఈ మతిలేని హింసలో బాధితులైన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది