లక్నోకు చెందిన డాక్టర్ ఎంసీ సక్సేనా మెడికల్ కాలేజీ 2015-16 సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చిన యాజమాన్యానికి అక్షింతలు వేసిన న్యాయస్థానం విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల చొప్పున 150 మందికి పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2015-16 సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చిన మెడికల్ కాలేజీ యాజమాన్యానికి అక్షింతలు వేసింది. లక్నోకు చెందిన డాక్టర్ ఎంసీ సక్సేనా మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ లో అక్రమ ఎడ్మిషన్లను తప్పుబడుతూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ భారీ జరిమానా విధించింది. విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల చొప్పున 150 మందికి పరిహారం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కొంతమంది విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై జస్టిస్ దేవేంద్ర కుమార్ అరోరా ఈ తీర్పును ప్రకటించారు. అంతేకాదు వైద్య కళాశాల అడ్మిషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆమోదించిన మార్గదర్శకాలపట్ల యాజమాన్యం అవిధేయతను ప్రకటించిందని మండిపడింది.
రెండు నెలల్లో మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ జనరల్ వద్ద ఈ మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. పూర్తి పరిశీలన తర్వాత ఈ పరిహారాన్ని ఆయా విద్యార్థులకు డైరక్టర్ జనరల్ పంపిణీ చేస్తారని పేర్కొంది. అలాగే మొదటి సం.రం పరీక్షలు రాసేందుకు అనుమతించాలన్న విద్యార్థులను పిటిషన్ను కూడా కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిగానీ, అనుబంధంగానీ లేదని రాష్ట్ర న్యాయవాది సంజయ్ భాసిన్ వెల్లడించారు. నిబంధనలను పాటించకుండా పారదర్శకత లేకుండా అడ్మిషన్లు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన, అనారోగ్యకరమైన పద్ధతుల ద్వారా అక్రమ సంపాదనకు తెర తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.