ఇపుడు హెచ్డీఎఫ్సీ కూడా
ముంబై: ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజాలు గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించడంలో వరుసగా క్యూ కడుతున్నాయి. వరుసగా ప్రభుత్వరంగ మేజర్ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ వార్షిక ఎంసీఎల్ఆర్ పై కోత పెడుతూ ప్రకటించగా ఇపుడు ఈ కోవలోకి మరో దిగ్గజ బ్యాంక్ చేరింది. ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా హోం లోన్లపై 0.15 శాతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా బ్యాంకులన్నీ మహిళా రుణ గ్రహీతలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
హోం రుణాలను 9.15 శాతం వడ్డీరేటుతో మహిళా రుణగ్రహీతలకు రూ .75 లక్షల వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే ఇతరులకు తగ్గింపు రేటులో అంటే 9.20శాతాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎప్పటిలాగానే గత రెండు నెలలుగా తమ ఫండ్స్ మార్జినల్ కాస్ట్ (ఉపాంత వ్యయాలు)తగ్గుముఖం పట్టాయని, ఈ ప్రయోజనాలను వినియోగదారులకు పంచడమే తమ లక్ష్యమని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ చెప్పారు.
కాగా ఆర్ బీఐ సూచనలమేరకు ఎస్ బీఐ తో పాటు మరిన్ని బ్యాంకులు రుణ వడ్డీరేటును తగ్గించక తప్పదని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే ఈ పరిణామం మిగతా చిన్న బ్యాంకులపై పడనుందని కూడా విశ్లేషించారు.