
ప్రాణంమీదకు తెచ్చిన పెళ్లి ఫొటోలు
రేక్ జవిక్: వెరైటీగా ఉంటుందనుకున్న వెడ్డింగ్ ఫొటో షూట్ కాస్తా వధువు ప్రాణాలమీదకు తెచ్చిన సంఘటన ఐస్ లాండ్ లో చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఓ కొత్త జంట పెళ్లిఫొటోలు తీయాల్సిందిగా ప్రపంచంలో బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లలో ఒకరైన సీఎం లెంగ్ ను కోరారు. ఆమేరకు అందరూ కలిసి ఐస్ లాండ్ కు వెళ్లారు. వివిధ పర్యాటక ప్రాంతాలు, రమణీయ ప్రదేశాల్లో వధూవరులను వివిధ భంగిమల్లో ఫొటోలు తీశాడు లెంగ్. ఆఖర్లో ఓ నదీతీరంలో జరిగిన ఫొటోషూట్ మాత్రం ప్రమాదకరంగా మారింది.
నదీ తీరంలో హెలికాప్టర్ బ్యాగ్రౌండ్ లో ఫొటో తీయాలనుకున్న లెంగ్.. ఐర్లాండిక్ కోస్టల్ గార్డ్ హెలికాప్టర్ ఒకదానిని అద్దెకు తీసుకున్నాడు. పాల నురగలాంటి పెళ్లి దుస్తుల్లో వెయిల్ పట్టుకుని నిల్చున్న పెళ్లి కూతురుపై నుంచి హెలికాప్టర్ వెళుతుండగా ఫొటోలు చిత్రీకరించాల్సిఉంది. అయితే హెలికాప్టర్ సరాసరి తలపైకి వచ్చేసరికి.. రెక్కల గాలి ఉధృతికి వధువు చిగురుటాకులా వణికి, కిందపడబోయింది. ఆమె ధరించిన వెయిల్ అమాంతం ఎగిరి హెలికాప్టర్ రెక్కల్లో ఇరుక్కుంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోరప్రమాదం తప్పినట్లైంది. ముఖాన దుమ్ము, చెరిగిన జుట్టుతో ఆ పెళ్లికూతురికి ఏడుపొక్కటే తక్కువ! ఇంతటి ప్రమాదకర స్థితిలోనూ అద్భుతమైన ఫొటోలు తీసీ కొత్తజంట కోపాన్ని సంతోషంగా మార్చేశాడు ఫొటోగ్రాఫర్ సీఎం లెంగ్. వాటితోపాటు అతను తీసిన ఫొటోలు కొన్ని మీకోసం..