
ప్రముఖ హీరోయిన్‌గా రాణించాలన్నదే ఆశ
తాను అలాంటి పాత్రలు చేయను అంటోంది నటి రెజీనా. చాలా కాలం తరువాత ఈ అమ్మడికి కోలీవుడ్‌లో టైమ్ వచ్చినట్లుంది. ఎప్పుడో శివకార్తికేయన్‌తో కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రంలో జత కట్టిన రెజీనాకు ఆ చిత్రం విజయం సాధించినా అవకాశాలు రాలేదు. మధ్యలో రాజతందిరం వంటి ఒకటి అరా చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం చేతిలో మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. రెజీనా నటించిన మానగరం చిత్రం మంచి విజయాన్ని ఇచ్చింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన సరవణన్ ఇరుక్కభయమేన్ చిత్రం మంచి ఆదరణను పొందుతోంది.
అయితే ఈ చిత్రంతోనే అమ్మడు బాగా వార్తల్లో నానుతోంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌తో డ్యూయెట్స్‌లో గ్లామర్ విషయంలో కాస్త శ్రుతిమించి నటించింది. దీంతో అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయట. అయితే దర్శకులు కమర్షియల్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనకు కధలను వినిపిస్తున్నారంటూ వాపోతోంది. తాను అలాంటి పాత్రల్లో నటిస్తే తనకు గ్లామరస్ నాయకిగా ముద్ర పడిపోతుందని భావించి ఆ అవకాశాలను తిరస్కరించానని చెప్పుకొచ్చింది.
గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం కాదని, కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణించాలన్నదే తన ఆశ అని చెప్పింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్‌జే.సూర్యకు జంటగా నటిస్తున్న నెంజం మరప్పదిల్లై, అధర్వతో నటిస్తున్న జెమినీగణేశనుం సురుళీరాజవుం, రాజతందిరం-2 చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తున్నానని, ఈ చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెడతాయనే నమ్మకం ఉందని రెజీనా చెప్పుకొచ్చింది.