సమ్మె ఇంకెంత కాలం ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో చేపట్టిన సమ్మెను ఇంకా ఎంత కాలం చేస్తారని ఉద్యోగులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి శనివారం తమకు స్పష్టతనివ్వాలని ఉద్యోగుల తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది. ‘‘ఇలా మేము అడుగుతున్నామంటే దాని ఉద్దేశం మీ (ఉద్యోగుల తరఫు న్యాయవాదులు) వాదనలను అడ్డుకోవడం గానీ, సమ్మెను ఉపసంహరింపచేయడం గానీ కాదు. మీ (ఉద్యోగులు) వైఖరి ఏది ఏమైనప్పటికీ, మా నిర్ణయం మేము తీసుకుంటాం.’’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. విచారణను శనివారానికి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి తన వాదనలను కొనసాగించారు.
ప్రజల ప్రయోజనాల కంటే పిటిషనర్‌కు సమైక్య ఉద్యమాన్ని అడ్డుకోవడం వల్ల వచ్చే లాభాలే ముఖ్యమని, ఈ విషయం పిటిషన్‌ను పరిశీలిస్తే స్పష్టమవుతోందని అన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్ సొంత ప్రయోజనాల కోసం ఈ వ్యాజ్యం దాఖలు చేయలేదు కదా? అని ప్రశ్నించింది. దీనికి మోహన్‌రెడ్డి సమాధానమిస్తూ, గతంలో తెలంగాణ ఎన్జీవోలు సమ్మె చేసినప్పుడు తెలంగాణలో పాలన స్తంభించిపోయిందని, అప్పుడు దీనిపై హైకోర్టును ఆశ్రయించని పిటిషనర్... సీమాంధ్రలో ఉద్యమాన్ని నిలుపుదల చేయాలని కోరడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని మోహన్‌రెడ్డి కోరారు. ఆ తరువాత సచివాలయ ఉద్యోగుల తరఫున న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం వారి ప్రాథమిక హక్కు కాదని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... సమ్మె చేయడంపై ఎటువంటి నిషేధమూ విధించలేదని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకీ క్లయింట్‌లు (ఉద్యోగులు) ఇంకా ఎంత కాలం సమ్మె చేస్తారు? ఇలాగే సమ్మె కొనసాగించే ఉద్దేశం వారికి ఉందా? ఈ విషయంపై వారితో చర్చించి శనివారం ఏ విషయం మాకు చెప్పండి’’ అని ఆయా న్యాయవాదులకు సూచించింది. ‘‘సమ్మె ఆగిపోతే పిటిషనర్ ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారా! ఆయన సాధించేది ఏముంది? అంతిమంగా ఎవరు లబ్ది పొందుతారన్నదే మనం చూడాల్సింది. మీరు (ఉద్యోగులు) సమ్మె విరమించుకుంటే మేము తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా...’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడంతో కోర్టులో నవ్వులు విరిశాయి.