సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. సీమాంధ్ర ఎంపీలు.. ప్రత్యేకించి లోక్‌సభ సభ్యులందరూ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 13 నుంచి ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఉద్యోగ సంఘాలతో రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘం తూతూమంత్రంగా చర్చలు జరిపి సమ్మె విరమించాలని కోరింది. అందుకు ఉద్యోగ సంఘాలు నిరాకరించాయి. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ప్రజల అండ లభించింది.
సీమాంధ్ర ఎంపీలు అందరూ రాజీనామా చేయాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన ఏకైక డిమాండ్‌ను ఇద్దరు లోక్‌సభ సభ్యులు (వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి) తప్ప మిగతావారు పట్టించుకోలేదు. సీమాంధ్ర ఎంపీల బలం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదని, ఎంపీలు రాజీనామా చేస్తే విభజన నిర్ణయం వెనక్కిపోతుందంటూ ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. సమ్మె నెల రోజులు దాటిన తర్వాత కూడా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్‌నే మళ్లీమళ్లీ వినిపించాల్సి వస్తోంది. ఎంపీల రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని గురువారం కూడా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు.
పంచాయతీ నుంచి కలెక్టరేట్ దాకా..
సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నెల రోజుల్లో ఒక్క ఫైలు కూడా కదల్లేదు. గ్రామ సచివాలయం మొదలు కలెక్టరేట్ వరకు.. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గ్రామ సేవకుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి దాకా అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు తప్ప.. మిగతా ఉద్యోగులెవరూ విధులకు హాజరుకావడం లేదు. ఉపాధ్యాయులూ సమ్మెలో ఉండటంతో స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థులు కూడా వీధులుకెక్కి ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఆర్టీసీ కార్మికులు నెలరోజులుగా సమ్మెలో ఉండటంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సీమాంధ్రలోని 123 డిపోల్లో 122 డిపోల్లో బస్సులు గడప దాటలేదు. తిరుమల డిపోకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల సమైక్య పోరుకు నెల
Published Fri, Sep 13 2013 3:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement