లాయర్ల సమ్మెతో స్తంభించిన కోర్టులు
Published Tue, Feb 25 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
న్యూఢిల్లీ: ఎమిటీ స్కూల్ ఉద్యోగులతో ఘర్షణ పడ్డ తమ సహచరులపై కేసు నమోదు చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఆరు జిల్లా కోర్టు న్యాయవాదులు సోమవారం ఒక్క రోజు సమ్మె చేశారు. దీంతో అన్ని కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఢిల్లీ జిల్లాకోర్టు బార్ సంఘాల సమన్వయ సంఘం పిలుపు మేరకు సాకేత్, పటియాలా హౌస్, తీస్‌హజారీ, ద్వారక, కార్కర్‌డూమా, రోహిణి జిల్లాకోర్టుల న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కోర్టుల కార్యకలాపాలు పూర్తిగా నిల్చిపోయాయని, అత్యవసర కేసులకు మాత్రమే కొందరు న్యాయవాదులు హాజరయ్యారని సంఘం చైర్మన్ రాజీవ్‌జై అన్నారు. న్యాయవాదుల గైర్హాజరుపై కోర్టులు కూడా చర్యలు తీసుకోలేదని సాకేత్ కోర్టు న్యాయవాది ఒకరు తెలిపారు. పోలీసు కేసును నిరసిస్తూ 100 మంది న్యాయవాదులు నిరాహార దీక్షకు కూడా సిద్ధపడ్డారని రాజీవ్ తెలిపారు. ‘మాపై పోలీసులు తప్పుడు పద్ధతిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
న్యాయవాదులతో అనుచితంగా ప్రవర్తించిన ఎమిటీ స్కూల్ ఉద్యోగులపైనే పోలీసులు కేసులు పెట్టాలి. ఈ మేరకు స్థానిక డీసీపీకి వినతిపత్రం సమర్పించాం. దోషులపై చర్యలు తీసుకుంటామని, విచారణ జరిపిస్తామని ఆయన మాకు హామీ ఇచ్చారు’ అని ఆయన వివరించారు. విద్యార్థులు బస్సు ఎక్కడానికి వీలుగా కాసేపు ఆగాలని ఎమిటీ స్కూలు డ్రైవర్ ఈ నెల 22న ఒక న్యాయవాదికి సూచించడంతో ఘర్షణ మొదలయింది. ఈ గొడవ ముదరడంతో దాదాపు 50 మంది న్యాయవాదులు సాకేత్‌లోని స్కూల్‌పై దాడి చేశారు. పలువురు న్యాయవాదులు టీచర్లు, సిబ్బందిని కొట్టారని యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే న్యాయవాదులు మాత్రం తాము ఎవరిపైనా దాడి చేయడం లేదని అంటున్నారు. ఎమిటీ స్కూల్ యాజమాన్యం చేసిన తప్పుడు ఫిర్యాదుపై పోలీసులు ఆగమేఘాల మీద స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అన్నారు.
Advertisement
Advertisement