ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు వాదించం: న్యాయవాదులు
Published Wed, Oct 9 2013 2:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యుల జోక్యం నేపథ్యంలో గ్యాంగ్ రేప్ కేసు నుంచి తప్పుకుంటున్నామని దోషులు ముఖేశ్, పవన్‌కుమార్ గుప్తాల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. ఈ కేసుపై అప్పీలు చేయాలంటూ కుటుంబసభ్యులతోపాటు కొందరు అడ్వొకేట్లు తన పనిలో జోక్యం చేసుకుంటున్నారని దోషి ముఖేశ్ తరపు న్యాయవాది వి.కె.ఆనంద్ మంగళవారం జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభారాణిల దృష్టికి తీసుకెళ్లారు.
తాను ఈ కేసు నుంచి వైదొలగాలనుకుంటున్నామని, అందువల్ల ఈ పనినుంచి తనను కచ్చితంగా తప్పించాలని కోరారు. తన నిర్ణయాన్ని ముఖేశ్ సోదరుడికి తెలియజేసినట్టు చెప్పారు. దీంతో కోర్టు ఆనంద్ విన్నపాన్ని అంగీకరించింది. ఈ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని తెలియజేసింది. మరోవైపు ఈ కేసు నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు పవన్‌కుమార్ గుప్తా తనకు టెలిఫోన్ ద్వారా సమాచారమందించాడని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయన్ కృష్ణన్ హైకోర్టుకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తును అందుకున్న హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ దోషులు ముఖేశ్, పవన్‌కుమార్ గుప్తాల తరఫున మధ్యవర్తిని తాము నియమించాల్సి ఉంటుందంది.
కాగా సామూహిక అత్యాచార కేసులో దిగువకోర్టు ఇచ్చిన తీర్పును దోషులు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లు హైకోర్టులో సోమవారం సవాలు చేసిన సంగతి విదితమే. ఈ మేరకు వారి తరపు న్యాయవాది ఎ.పి.సింగ్ సోమవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ దిగువ న్యాయస్థానం గత నెలలో తీర్పు వెలువరించింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కదులుతున్న బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని నలుగురు దోషులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి విదితమే.
ప్రొడక్షన్ వారంట్ల జారీ
గ్యాంగ్ రేప్ కేసులో దోషులు ముఖేశ్, పవన్‌కుమార్ గుప్తాలపై హైకోర్టు మంగళవారం తాజా ప్రొడక్షన్ వారంట్ జారీచేసింది. ఈ కేసు నుంచి తమను తప్పించాలంటూ వీరి తరపు న్యాయవాదులు తెలియజేసిన నేపథ్యంలో బుధవారం కోర్టుకు హాజరుపరచాలని తీహార్ కారాగార అధికారులను ఆదేశించింది. ఉరిశిక్ష విధిస్తూ దిగువకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వీరు సోమవారం హైకోర్టులో ఓ పిటిషన్‌ను దాఖలుచేసిన సంగతి విదితమే. కాగా గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన సంగతి విదితమే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై పెల్లుబికిన నిరసన సెగలు రైజినా హిల్స్‌ను తాకాయి.
Advertisement
Advertisement