'సుజనా'కు చుక్కెదురు
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు మంగళవారం ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తమకు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సుజనా ఇండస్ట్రీస్ దాఖలు చేసిన కంపెనీ అప్పీల్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. అదే సమయంలో సుజనా ఇండస్ట్రీస్ మూసివేత కోసం తాము దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని ఆరు నెలల పాటు పత్రికా ప్రకటన రూపంలో ఇవ్వద్దన్న సింగిల్ జడ్జి ఆదేశాన్ని సవాలు చేస్తూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఆదేశాన్ని కొద్దిగా సవరించింది. పత్రికా ప్రకటన ఇచ్చే కాల వ్యవధిని ఆరు నెలల నుంచి ఐదు నెలలకు కుదించింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఉన్న బకాయిలను సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చెల్లించకపోతే, ఆ వెంటనే కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియచేయవచ్చునని ఎంసీబీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హేస్టియా పేరుతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కంపెనీని మారిషస్‌లో ఏర్పాటు చేసి, మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి 2010లో హేస్టియా రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గారెంటార్)గా ఉంది. అయితే హేస్టియా బకాయిలను చెల్లించకపోవడంతో హామీదారుగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌పై ఎంసీబీ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. తమ నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును చెల్లించే స్థితిలో సుజనా చౌదరి లేనందున ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తద్వారా తమ అప్పును తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది.
దీన్ని విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సుజనా ఇండస్ట్రీస్ మూసివేత కోసం ఎంసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ తీర్పునిచ్చారు. అయితే కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని ఆరు నెలల వరకు పత్రికల్లో ప్రకటన రూపంలో ఇవ్వకుండా ఎంసీబీని నిరోధించారు. కంపెనీ పిటిషన్ విచారణకు స్వీకరణ పై సుజనా ఇండస్ట్రీస్, ఆరు నెలల పాటు పత్రికా ప్రకటన ఇవ్వకుండా తమను నిరోధించడంపై ఎంసీబీ వేర్వేరుగా ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. రుణదాత తన బకాయి వసూలు నిమిత్తం హామీదారు కంపెనీలను మూసివేయాలంటూ కంపెనీ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్న సుజనా ఇండస్ట్రీస్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సుదర్శన్‌రెడ్డి చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదే సమయంలో తీసుకున్న రుణానికి హామీదారు బాధ్యత కూడా సమానంగా ఉంటుందని అందువల్ల కంపెనీ పిటిషన్ విచారణార్హమైనదేనంటూ ఎంసీబీ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.