sujana universal industry
-
‘సుజనా’ డైరెక్టర్లకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా గ్రూపు కంపెనీల డైరెక్టర్లకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరి అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ కంపెనీల డైరెక్టర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టేసింది. ఇలాంటి కేసుల్లో అధికరణ 226 కింద హైకోర్టులు తమకున్న న్యాయ విచక్షణను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. అంతేకాక దర్యాప్తులో అరెస్ట్ భాగమని పేర్కొంది. కాగితాలపై రూ.1,290 కోట్ల టర్నోవర్ చూపి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కింద రూ.225 కోట్ల మేర లబ్ధి పొందినట్లు ఈ ఆరుగురు డైరెక్టర్ల మీద ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలన్న సెంట్రల్ ట్యాక్స్ అధికారుల ఆలోచన తప్పుకాదని అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. జీఎస్టీ కమిషనర్‌కు అధికారముంది... జీఎస్టీ చెల్లింపులో సెంట్రల్ ట్యాక్స్ అధికారులు జారీ చేసిన సమన్లను రద్దు చేయడంతో పాటు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుజనా గ్రూపునకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ జి.శ్రీనివాసరాజు, హిందుస్థాన్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బి.వెంకట సత్య ధర్మావతార్, ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ పి.వి.రమణారెడ్డి, ఈబీసీ బేరింగ్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బాలకృష్ణమూర్తి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం గురువారం 43 పేజీల తీర్పు వెలువరించింది. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు తగిన కారణాలు ఉంటే ఆ వ్యక్తి లేదా వ్యక్తుల అరెస్ట్‌కు ఆదేశాలిచ్చే అధికారం సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69(1) కింద జీఎస్టీ కమిషనర్‌కు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. కారణాలను ఫైల్లో పొందుపరిస్తే సరిపోతుందని, అరెస్ట్ ఉత్తర్వుల్లో విశ్వసించదగ్గ కారణాలను పేర్కొనాల్సిన అవసరం లేదని తెలిపింది. అరెస్ట్ విషయంలో అధికరణ 226 కింద హైకోర్టులు తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తు చేసిన ధర్మాసనం, సీఆర్పీసీ సెక్షన్ 438 కింద అధికరణ 226 కింద ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెప్పింది. అసెస్మెంట్ పూర్తయిన తరువాతనే అరెస్ట్ చేయడం గానీ, ప్రాసిక్యూషన్ మొదలుపెట్టడం గానీ చేయాలన్న పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదంది. సీజీఎస్టీ చట్టం కింద ఓ అధికారి నిర్వహించే ప్రొసీడింగ్స్ జ్యుడీషియల్ ప్రొసీడింగ్స్ కిందకు వస్తాయని, అందువల్ల సమన్లు అందుకున్న వ్యక్తి తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. ఏ రకంగా చూసినా సీజీఎస్టీ చట్టం కింద పిటిషనర్ల అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోవడానికి కారణాలు కనిపించడం లేదంది. అందువల్ల పిటిషనర్ల అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
ఆ రూ.133 కోట్లు ఎక్కడివి?
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ వై. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పదవి చేపట్టడానికి సరిగ్గా రెండు రోజుల ముందు తీర్చేసిన రూ.133 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధానంగా దృష్టి సారించింది. మంత్రి పదవికి అడ్డంకిగా మారిన రూ.133 కోట్ల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాన్ని 2014 నవంబర్ 7న సుజనా చెల్లించారు. అనంతరం రెండు రోజులకే మోదీ సర్కారు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో 2014 నవంబర్ 9వ తేదీన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బ్యాంకు డిఫాల్టర్లకు మంత్రి పదవి ఎలా ఇస్తారని కాంగ్రెస్‌తో సహా బ్యాంకు యూనియన్లు సైతం నిలదీయటంతో సుజనా చౌదరి తన పేరుతో ఉన్న రుణాలన్నీ తీర్చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. అప్పటికే 2014 డిఫాల్టర్ల లిస్టును ఆడిట్ కమిటీ ఆమోదించడంతో ఆ జాబితాలో సుజనా యూనివర్సల్ పేరు కూడా ఉంది. కానీ తన పేరు మీద ఎటువంటి రుణాలు లేవని సుజనా చౌదరి అప్పట్లో స్వయంగా చెప్పారు. అంతేకాదు నవంబర్ 13న సుజనాగ్రూపు డైరక్టర్ల పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. 2015 డిఫాల్టర్ల లిస్టు నుంచి సుజనా పేరును తొలగించడంపై బ్యాంకు యూనియన్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రధాన ఆర్థిక వనరు సుజనా...! నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మిత్రపక్షానికి రెండు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని ప్రతిపాదించగా అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల పేర్లను టీడీపీ సూచించింది. అయితే బ్యాంకు డిఫాల్టర్ల జాబితాలో సుజనా పేరు ఉండటంతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మోదీ తిరస్కరించారు. దీంతో తొలివిడత మంత్రివర్గంలో సుజనాకు అవకాశం లభించలేదు. అనంతరం రెండోసారి మంత్రి వర్గ విస్తరణ సమయంలో కూడా చంద్రబాబు మరోసారి ఆయన పేరునే సూచించడంతో బకాయిలు చెల్లిస్తే తమకు అభ్యంతరం లేదన్న ప్రతిపాదన రావడంతో సుజనా హడావుడిగా రూ.133 కోట్ల రుణాన్ని తీర్చినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తికే మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు పట్టుబట్టడంటీడీపీకి సుజనా ప్రధాన ఆర్థిక వనరు అనే విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవి చేపట్టే నాటికి గ్రూపు సంస్థలు భారీ నష్టాల్లో ఉండటమే కాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. 2013 నాటికి సుజనా గ్రూపు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.930 కోట్లు బకాయి పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి సుజనా మెటల్స్ రూ.38 కోట్లు, సుజనా యూనివర్సల్ రూ.6.3 కోట్లు, సుజనా టవర్స్ రూ.1.8 కోట్ల నష్టాలను ప్రకటించాయి. మరి ఇంత నష్టాల్లో ఉన్న కంపెనీలు రూ.133 కోట్ల రుణాన్ని ఎలా తీర్చగలిగాయి? ఈ నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారనే అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విచారణలో ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఈనెల 27న విచారణకు హాజరు కాలేనని సుజనా చౌదరి ఆదివారం ప్రకటించిన సంగతి విదితమే. -
'సుజనా'కు చుక్కెదురు
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు మంగళవారం ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తమకు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సుజనా ఇండస్ట్రీస్ దాఖలు చేసిన కంపెనీ అప్పీల్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. అదే సమయంలో సుజనా ఇండస్ట్రీస్ మూసివేత కోసం తాము దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని ఆరు నెలల పాటు పత్రికా ప్రకటన రూపంలో ఇవ్వద్దన్న సింగిల్ జడ్జి ఆదేశాన్ని సవాలు చేస్తూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఆదేశాన్ని కొద్దిగా సవరించింది. పత్రికా ప్రకటన ఇచ్చే కాల వ్యవధిని ఆరు నెలల నుంచి ఐదు నెలలకు కుదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఉన్న బకాయిలను సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చెల్లించకపోతే, ఆ వెంటనే కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియచేయవచ్చునని ఎంసీబీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హేస్టియా పేరుతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కంపెనీని మారిషస్‌లో ఏర్పాటు చేసి, మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి 2010లో హేస్టియా రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గారెంటార్)గా ఉంది. అయితే హేస్టియా బకాయిలను చెల్లించకపోవడంతో హామీదారుగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌పై ఎంసీబీ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. తమ నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును చెల్లించే స్థితిలో సుజనా చౌదరి లేనందున ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తద్వారా తమ అప్పును తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సుజనా ఇండస్ట్రీస్ మూసివేత కోసం ఎంసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ తీర్పునిచ్చారు. అయితే కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విషయాన్ని ఆరు నెలల వరకు పత్రికల్లో ప్రకటన రూపంలో ఇవ్వకుండా ఎంసీబీని నిరోధించారు. కంపెనీ పిటిషన్ విచారణకు స్వీకరణ పై సుజనా ఇండస్ట్రీస్, ఆరు నెలల పాటు పత్రికా ప్రకటన ఇవ్వకుండా తమను నిరోధించడంపై ఎంసీబీ వేర్వేరుగా ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. రుణదాత తన బకాయి వసూలు నిమిత్తం హామీదారు కంపెనీలను మూసివేయాలంటూ కంపెనీ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్న సుజనా ఇండస్ట్రీస్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సుదర్శన్‌రెడ్డి చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదే సమయంలో తీసుకున్న రుణానికి హామీదారు బాధ్యత కూడా సమానంగా ఉంటుందని అందువల్ల కంపెనీ పిటిషన్ విచారణార్హమైనదేనంటూ ఎంసీబీ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.