
అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ పోటీపై ఎట్టకేలకు అధికారికంగా ఒక స్పష్టమైన ప్రకటన వెలువడింది. ఆదివారం అధికారిక ప్రచార వెబ్సైట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననీ.. అమెరికా వాసులు కోరుకుంటున్న ఛాంపియన్గా నిలవాలనుకుంటున్నానంటూ ఆ వీడియోలో హిల్లరీ పేర్కొన్నారు. దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ పోటీపై క్లారిటీ వచ్చింది.
దేశ అధ్యక్ష పదవి కోసం పోటీపడాలని హిల్లరీ మొదటిసారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండోసారి ఆ అవకాశాన్ని దక్కించుకున్న హిల్లరీ ఉత్సాహంగా తన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి న్యూయార్క్లోని బ్లూక్లిన్ హైట్స్ లో ఒక ప్రచార కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. త్వరలో హిల్లరీ ఓటర్లను కలుస్తారని, వచ్చే నెలలో ఒక ర్యాలీని నిర్వహించనున్నట్లు హిల్లరీ ప్రచార మేనేజర్ జాన్ పొడెస్తా వెల్లడించారు.