
భారత విద్యార్థులకు గ్రీన్‌కార్డ్ బెనిఫిట్ ఎక్కువ
వాషింగ్టన్: స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్) క్యాటగిరీ కింద అమెరికాలో ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సులను పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాస హోదాను కల్పిస్తామంటూ అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ఇచ్చిన హామీ నెరవేరిన పక్షంలో భారత విద్యార్థులకు అదృష్టం తన్నుకొని వచ్చినట్లే. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ లేదా పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థులు 1,32,888 మంది ఉన్నారు. వారిలో 80 శాతం మంది స్టెమ్ కేటగిరీలకు చెందిన వాళ్లే. ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు విధానం అమల్లోకి వచ్చినట్లయితే వారంతా ప్రయోజనం పొందుతారు.
అమెరికాలో పీజీ చేస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనా విద్యార్థులు సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉండగా, భారత విద్యార్థులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 3,04,040 మంది చైనా విద్యార్థులు, అంటే మొత్తం విదేశీ విద్యార్థుల్లో 30 శాతం వారే అన్నమాట. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డు కల్పించే అంశం చర్చకు వస్తుంది. ఈసారి కూడా అలాగే వచ్చింది. తాను అధికారంలోకి వస్తే విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు విధానాన్ని అమలు చేస్తానని రిపబ్లికన్ల తరఫున దేశాధ్యక్ష పదవికి పోటీ పడి తర్వాత పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిన మిట్ రోమ్నీ 2012 నుంచే హామీ ఇస్తూ వచ్చారు.
అదే పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన వలసలకు వ్యతిరేకం. ఆయనతో ఎన్నికల బరిలో డెమోక్రట్ల తరఫున పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు సౌకర్యాన్ని కల్పించే అంశంపై గతవారమే మొదటిసారిగా హామీ ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేశారు.
ఒకప్పుడు ఎఫ్-1 వీసాపై అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రేనింగ్’ పేరిట చదువు పూర్తయ్యాక పరిమతంగా కొన్ని నెలలపాటే అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు ఉండేది. 2008లో బుష్ ప్రభుత్వం ఈ కాలాన్ని 29 నెలలకు పెంచింది. 2015లో బరాక్ ఒబామా ప్రభుత్వం 36 నెలలకు పెంచింది. అంటే మూడేళ్లకు మించి అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీల్లేదన్నమాట. ఆ తర్వాత కూడా వారు ఉద్యోగంలో కొనసాగాలంటే ఈలోగా హెచ్-1బీ వీసా సంపాదించాలి.
అది రాకపోయినట్లయితే భారత్‌కు తిరిగి వెళ్లాల్సిందే. ఇప్పటీకీ ఇదే విధానం కొనసాగుతోంది. ఏడాదికి హెచ్-1బీ వీసాలను 65 వేలకు మించి అమెరికా మంజూరు చేయడం లేదు. యూనివర్శిటీల కేటగిరీల కింద అదనంగా మరో 20వేల వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ వీసాలకు ప్రతి ఏడాది పోటీ తీవ్రమవుతున్నప్పటికీ పరిమితి పెంచడం లేదు. యూనివర్శిటీ కేటగిరీ కింద ఎక్కువ హెచ్-1బీ వీసాలను ఐటీ కంపెనీలే తన్నుకుపోతుండడంతో ఇతర రంగాలకు చెందిన కంపెనీలు నిరుత్సాహపడుతున్నాయి.
ఇప్పుడు ఎంఎస్, పీహెచ్‌డీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు విధానాన్ని అమలు చేసినట్లయితే ఇలాంటి కంపెనీలు కూడా లబ్ధి పొందుతాయని హిల్లరీ క్లింటన్ భావిస్తున్నారు. అంతేకాకుండా నైపుణ్యం గల ఉద్యోగుల అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో తమ దేశంలో కొత్త కంపెనీలను ప్రారంభించేందుకు పెట్టుబడుదారులు పోటీ పడతారని ఆమె భావిస్తున్నారు. దేశంలో కంపెనీలు పెరగడం వల్ల విదేశీ విద్యార్థులతోపాటు స్థానిక అమెరికన్లకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నది ఆమె వాదన. ఆమె వాదనతో ఆమెతో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ విభేదిస్తున్నారు.