'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'
జింద్(హర్యానా): మహిళలు జీన్స్ ధరించకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ డిమాండ్ చేసిన మరుసటి రోజే... అదే సంస్థ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్తామని ఓ విలేకరితో చెప్పారు.
' ఈ విషయంపై మా నాయకులతో చర్చిస్తున్నాం. ఐటెం గాల్స్ ను సుప్రీంకోర్టు వేశ్యలుగా ప్రకటిస్తే సమాజం వారిని బహిష్కరిస్తుంది' అని వ్యాఖ్యానించారు. కురుచ దస్తులు ధరించి సినిమాల్లో కలిపించే ఐటెంగాల్స్, హీరోయిన్లను వేశ్యలుగా పరిగణించాలని త్యాగి పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. తమ న్యాయవాదులతో మాట్లాడుతున్నందున ఈ విషయాన్ని ఇప్పుడే బహిరంగంగా వెల్లడించలేనని అన్నారు.
పొట్టి బట్టలు వేసుకుని సినిమాల్లో తైతక్కలాడడం వల్లే మహిళలపై ఘోరాలు పెరుగుతున్నాయని త్యాగి అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, కాలేజీల్లో ఆడపిల్లలకు డ్రెస్ కోడ్ ఉండాలని సెల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ సోమవారం డిమాండ్ చేసింది.