కరాచీ: పాకిస్థాన్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్ పరిధిలోని లతీఫాబాద్ పట్టణంలో శుక్రవారం ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు హనుమాన్ ఆలయాన్ని అపవిత్రం చేశారు. ముందుగా వారు ప్రార్థన చేసిన అనంతరం హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని, తర్వాత కిరోసిన్ చల్లి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. అనంతరం వారు పరారయ్యారని చెప్పారు. ఇదే ఆలయంలో ఏప్రిల్ 14న వార్షిక ఉత్సవం జరగాల్సి ఉంది. స్థానికంగా 600 వరకు హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఘటన అనంతరం పట్టణంలో పలుచోట్ల హిందువులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికడీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 15న కూడా ఒక హిందూ ఆలయానికి అల్లరి మూకలు నిప్పంటించాయి.