హయ్యస్ట్ డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) భారీ డివిడెండ్ ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ 13.985 కోట్ల మధ్యంతర డివిడెండ్ బుధవారం ప్రకటించింది. దీంతో మొత్తం చెల్లించిన డివిడెండ్ విలువ రూ.27,157 కోట్లకు చేరింది.దీంతో దేశంలో అతి పెద్ద డివిడెండ్ చెల్లించిన కంపెనీగా హిందుస్థాన్ జింక్ నిలిచింది.
స్పెషల్ వన్ టైం మధ్యంతరం డివిడెండ్‌ను చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. 1,375 శాతం మధ్యంతర డివిడెండ్ లేదా డివిడెండ్ పంపిణీ పన్ను (డిడిటి) సహా, రూ 13.985 కోట్లను ప్రకటించింది. దీని ప్రకారం రూ .2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుకు రూ.27.50లను చెల్లించనుంది. 2016 ఏప్రిల్ లో చెల్లించిన గోల్డెన్ జుబ్లీ డివిడెండ్, అక్టోబర్ లో చెల్లించిన డివిడెండ్ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఉన‍్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ వాటాదారులకు స్పెషల్ డివిడెండ్ చెల్లించడం సంతోషంగా ఉందని, విలువ పంపిణీలో కంపెనీ నిబద్ధతను, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ ఛైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు.
కాగా మార్చిలో రూ.2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుపై రూ.24 డివిడెండ్ చెల్లించింది. ఏడాదికి 1 మిలియన్ టన్నుల సామర‍్ధ్యంతో జింక్, వెండి ఉత్పత్తిలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కంపెనీ హిందుస్థాన్ జింక్.