ఐటీసీకి ఎఫ్‌ఎంసీజీ అండ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో రూ. 2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో ఆర్జించిన రూ. 2,052 కోట్లతో పోలిస్తే ఇది 16%పైగా వృద్ధి. ఇందుకు ఎఫ్‌ఎంసీజీ, వ్యవసాయ బిజినెస్ విభాగాల అమ్మకాలు పుంజుకోవడం సహకరించింది. నికర అమ్మకాలు సైతం 13% పెరిగి రూ. 8,623 కోట్లకు చేరాయి.
గతంలో రూ. 7,627 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.ఎఫ్‌ఎంసీజీలో భాగమైన ప్యాకేజ్డ్ ఫుడ్స్ కేటగిరీ నష్టాల నుంచి బయటపడి రూ. 10.3 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. గతంలో ఈ కేటగిరీ కింద రూ. 24 కోట్ల నికర నష్టాలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక వ్యవసాయ విభాగం నుంచి 19% అధికంగా రూ. 205 కోట్ల లాభం సమకూరగా, అమ్మకాలు రూ. 1,786 కోట్లకు చేరాయి. ఈ బాటలో హోటళ్ల (ఆతిథ్యం) బిజినెస్ నుంచి రూ. 62 కోట్ల నికర లాభం, రూ. 315 కోట్ల ఆదాయం లభించింది. కాగితం, ప్యాకేజింగ్ బిజినెస్ నుంచి రూ. 1,257 కోట్ల ఆదాయాన్ని సాధించగా, రూ. 232 కోట్ల నికర లాభాన్ని పొందింది.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర
నామమాత్ర నష్టంతో రూ. 325 వద్ద ముగిసింది.