కొత్తనోట్ల బాగోతంపై సుప్రీంకోర్టు విస్మయం
- సామాన్యులకు 24 వేలే ఇవ్వడం లేదు
- కొందరికి కొత్తనోట్లు లక్షల్లో ఎలా వస్తున్నాయి?
- కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులకు వెయ్యి, రెండువేలు ఇవ్వడానికి బ్యాంకులు చేతులు ఎత్తేస్తుండగా.. కొందరు అక్రమార్కుల వద్ద కొత్త కరెన్సీ రూపంలో కోటానుకోట్ల నల్లధనం వెలుగుచూస్తోంది. ఇదే విషయమై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రజలు బ్యాంకుల్లో కనీసం రూ. 24వేలు తీసుకోలేకపోతున్నారు, అలాంటి సమయంలో కొందరి వద్దకు లక్షలు లక్షలు కొత్త కరెన్సీ ఎలా వస్తున్నదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కొందరి వద్దకు కొత్త కరెన్సీ పెద్దమొత్తంలో ఎలా వస్తున్నదని సీజీఐ ప్రశ్నించారు. అటార్నీ జనరల్ రోహత్గీ బదులిస్తూ కొందరు బ్యాంకు మేనేజర్లు అక్రమాలకు పాల్పడుతున్నందువల్ల అక్రమార్కులకు కొత్త కరెన్సీ పెద్ద మొత్తంలో అందుతున్నదని, ఈ అక్రమాలను అరికట్టడానికి కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని సుప్రీంకోర్టుకు నివేదించారు. అదేవిధంగా పెద్దనోట్ల రద్దు తర్వాత సహకార బ్యాంకులు ఇప్పటివరకు సేకరించిన మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు అనుమతించే అవకాశముందని రోహత్గీ తెలిపారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలను రూపుమాపేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని చెప్పారు.