
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
ఇంట్లో కుటుంబమంతా నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కిలోన్నర బంగారం, రూ. 2 లక్షల నగదు అపహరణ
హైదరాబాద్: ఇంట్లో కుటుంబమంతా నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సయ్యద్ షాహన్‌వాజ్ (42) అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 3న మలక్‌పేట ఆస్మాన్‌ఘడ్ వెంకట్రాది నగర్‌లో తన నివాసానికి వచ్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో భార్య, పిల్లలతో కలసి శాలిబండలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు.
తిరిగి రాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి పడుకున్నారు. తెల్లవారుజామున షాహన్‌వాజ్ లేచేసరికి గదిలో ఉన్న బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న కిలోన్నర బంగారం, రెండు లక్షల నగదు, 5 వేల అమెరికా డాలర్లు కన్పించలేదు. దీంతో వెంటనే వారు మలక్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, మలక్‌పేట ఏసీపీ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బాధితులనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.