దక్షిణ సూడాన్‌లో భారతీయుల ఆక్రందన
బాధితుల్లో 100 మంది తెలుగువారు
సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ దేశంలో రెండు తెగల మధ్య తాజాగా మొదలైన అంతర్యుద్ధం అక్కడ నివసిస్తున్న సుమారు 450 మంది భారతీయులను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. తమకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న వారంతా భారత ప్రభుత్వం తమను ఆదుకోవాలం టూ వేడుకుంటున్నారు. ప్రత్యేక విమానాల్లో తమను వెంటనే స్వదేశానికి తరలించాలని కోరుతున్నారు. అయితే దీనిపై అక్కడి మన రాయబార కార్యాలయం ఇప్పటివరకూ స్పందించలేదు. తమ దయనీయ స్థితిని ఓ బాధితుడు ‘సాక్షి’కి వివరించారు. ‘అంతర్యుద్ధం కారణంగా వారం నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. నేనున్న ప్రాంతంలో సుమారు 500 మంది మృతి చెందారు. ఎవరైనా ఆదుకుంటారేమోనని ఎదురుచూస్తున్నాం. ఇక్కడ ఉన్న భారత రాయభారి పర్మోద్ బజాజ్‌ను సాయం చేయాలని అర్థిం చాం. ఇంతవరకూ భారత ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరోవైపు అమెరికా, బ్రిటన్, చైనా, మలేసియా ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను పంపి వారి దేశస్తులను తీసుకెళ్లాయి.
ఇక్కడ భారతీయులు 450 మంది ఉన్నారు. ఇందులో తెలుగువారు సుమారు 100 మందికిపైగా ఉన్నారు. మా వద్ద డబ్బులు కూడా లేవు’ అని సౌత్ సూడాన్ రాజధాని జూబా నుంచి నర్సరావుపేటకు చెందిన బోస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యేక విమానాల ద్వారా తమను వెంటనే తరలించాలని ఆయన కోరారు. గత రెండు రోజుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందడం లేదని ఆయన వాపోయారు. పత్రిక ద్వారా సమాచారం తెలియజేసి తమను ఆదుకోవాలని ఆయన విన్నవించారు. సూడాన్ నుంచి 2011లో రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌లో ప్రధానంగా రెండు తెగలు ఉన్నాయి. డింకా తెగకు చెందిన దేశాధ్యక్షుడు సల్వా కీర్... న్యూర్ తెగకు చెందిన ఉపాధ్యక్షుడు ఈయక్ మచార్‌ను పదవి నుంచి తొలగించడంతో గత ఆదివారం ఇరు తెగల ప్రజల మధ్య చెలరేగిన అల్లర్లు చివరకు అంతర్యుద్ధానికి దారితీశాయి.