
గోవా నుంచే దందా
- కెల్విన్‌కు అధిక శాతం డ్రగ్స్ అక్కడి నుంచే..
- నిఖిల్ షెట్టితో గోవా నుంచి డ్రగ్ తెప్పించిన కెల్విన్
- ప్రాథమికంగా నిర్ధారించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
- హోటళ్లలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో పెడలర్ అరెస్ట్
- బహుళజాతి కంపెనీల్లో డ్రగ్స్ వాడకంపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ దందాలో ప్రధానంగా గోవా నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ గోవా నుంచే డ్రగ్స్ తీసుకొచ్చి.. నిఖిల్‌షెట్టి, ఇతర పెడలర్లకు అందించినట్లుగా గుర్తించారు. అంతేగాకుండా ఓ సినీ నిర్మాతకు గోవాలోనే డ్రగ్స్ అందజేశారంటే.. ఈ వ్యవహారం ప్రధాన లింకు గోవాలోనే ఉండి ఉంటుం దన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరొకరు అరెస్టు..
డ్రగ్ దందాలో కెల్విన్‌తో ఉన్న ఒక్కొక్క లింకును ఎక్సైజ్ అధికారులు ఛేదిస్తున్నారు. కెల్విన్ తర్వాత కీలకంగా వ్యవహరించిన నిఖిల్‌షెట్టిని మంగళవారం అరెస్టు చేసి విచారించగా.. మరో పెడలర్ పేరు బయటపెట్టాడు. హోటళ్లలో డ్రగ్స్ సరఫరా చేసే బ్రెండిన్ బిన్ అనే వ్యక్తికి తాను డ్రగ్స్ విక్రయించినట్టు వెల్లడించారు. దీంతో బుధవారం సిట్ అధికారులు డాగ్ కెన్నల్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్న బ్రెండిన్ బిన్‌ను అరెస్టు చేశారు. స్టార్ హోటళ్లకు ఇతడే ప్రధాన డ్రగ్ సరఫరాదారుగా భావిస్తున్నారు.
ఒక్కో విభాగానికి ఒకరు
కెల్విన్ ఒక్కో విభాగానికి డ్రగ్స్ సరఫరా చేసేందుకు వేర్వేరుగా పెడలర్లను ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు అబ్దుల్ వహీబ్, అబ్దుల్ ఖుద్దూస్, అమన్‌నాయుడులను పెడలర్లుగా మార్చాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఓ స్టార్టప్ కంపెనీ యజమానిగా ఉన్న నిఖిల్‌షెట్టిని.. స్టార్ హోటళ్లకు సరఫరా చేసేందుకు హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న బ్రెండిన్ బిన్‌ను పెడలర్లుగా మార్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
తదుపరి ఎంఎన్‌సీలే టార్గెట్..
స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లలో డ్రగ్స్ సరఫరా లింకులను కొంతవరకు ఛేదించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు... తదుపరి టార్గెట్‌గా బహుళజాతి కంపెనీ (ఎంఎన్‌సీ)లను ఎంచుకున్నారు. 19 ఎంఎన్‌సీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధముందని కెల్విన్ ఫోన్‌కాల్ డేటా, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సమాచారం ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు బేగంపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
కెల్విన్ కస్టడీ కోరనున్న సిట్
డ్రగ్స్ కేసులో ప్ర«ధాన నిందితుడైన కెల్విన్‌ను కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ భావిస్తోంది. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ లింకులున్నాయి, మరెన్ని స్కూళ్లకు సరఫరా చేశారు.. తదితర వివరాలను రాబట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కెల్విన్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.
నేరుగా డ్రగ్స్‌తో దొరికితేనే..
మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించి ఎన్‌డీపీఎస్ యాక్ట్–1985 ప్రకారం.. ఎవరైనా రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్‌తో సహా పట్టుబడితేనే అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. కనీసం 100 గ్రాముల డ్రగ్స్ ఉంటేనే ఆ వ్యక్తి పెడలర్ (డ్రగ్స్ సరఫరా చేసేవారు)గా పరిగణిస్తారు. అంతకన్నా తక్కువ డ్రగ్స్ దొరికితే వారిని డ్రగ్స్ వినియోగించే వారిగా లెక్కలోకి తీసుకుంటారు. తాజా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఓ సినీనిర్మాత, స్కూళ్లు, కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ విక్రయిస్తున్నారని, వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నేరుగా డ్రగ్స్ పట్టుబడితే మాత్రమే అరెస్టు చేసే అధికారం ఉంటుంది. లేకపోతే విచారణ కోసం నోటీసులు జారీచేసి దర్యాప్తు చేయాల్సి ఉంటుందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు.
సీఐడీ నార్కోటిక్‌కు కేసు బదిలీ..!
భారీస్థాయిలో డ్రగ్స్ లింకు ఉండటంతో ప్రభుత్వం ఈ కేసును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి సీఐడీలోని నార్కోటిక్ సెల్‌కు బదిలీ చేసే అవకాశముందని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. సరైన దర్యాప్తు లేదన్న ఆరోపణలు, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేంత సిబ్బంది, అధికారులు లేకపోవడం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయాల్సి రావడం ఇందుకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. సీఐడీకి ఇస్తే దర్యాప్తులో ఇబ్బందులుండవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.