ఎక్కడి శ్రీనగర్.. ఎక్కడి నాంపల్లి!
- ఏడాదంతా వేచిచూసి.. ఆశలతో వచ్చినా కొనేవారు కరువు
- 'నుమాయిష్'ను కుదుపుతున్న నోట్ల రద్దు!
ఎక్కడో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి.. ఎన్నో ఆశలతో నగరానికి వచ్చాడు ఇంతియాజ్ అలీ. నాంపల్లిలో కొనసాగుతున్న 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో 'కశ్మీరీ ఎంబ్రాయిడరీ సెంటర్' పేరిట స్టాల్ ఏర్పాటుచేశాడు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం కోసం ఏడాది మొత్తం ఎదురుచూసి.. ఏర్పాట్లు చేసుకొని మరీ వచ్చాడు. కానీ, ఈసారి ఆయన స్టాల్‌ను చూసి.. అందులోని అద్భుతమైన ఎంబ్రాయిడీ ఉత్పత్తులను చూసి మురిసిపోయే వారే కానీ.. కొనేవారు మాత్రం కరువయ్యారు. కారణం పెద్దనోట్లరద్దు.
డిమానిటైజేషన్ ఎఫెక్ట్‌తో ఇంతియాజ్ ఆశలు అడియాసలు అయ్యాయి. ఏడాదంతా వేచిచూసి.. మంచి గిరాకీ ఉంటుందన్న ఆశతో వస్తే.. నోట్లు రద్దు దెబ్బకు కొనేవాళ్లు కనిపించడం లేదు. 'ఈ ఎగ్జిబిషన్ కోసం మేం ఏడాదంతా వేచిచూస్తాం. గత 40 ఏళ్లుగా మా కుటుంబం ఇక్కడ స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నది. కానీ ఈ సంవత్సరం వ్యాపారం దారుణంగా పడిపోయింది. నిజానికి మేం కూడా పేటీఎంను వాడుతున్నాం. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు' అని ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాంపల్లిలో జరిగే నుమాయిష్‌తో ఇంతియాజ్ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తండ్రి, తాత ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చి తమ ఉత్పత్తులను అమ్మారు. కానీ, ఈ ఏడాది 70శాతం వరకు వ్యాపారం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆయన చెప్తున్నారు. 'గత ఏడాది రోజుకు రూ. 25వేల వ్యాపారం చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు కేవలం తొమ్మిది వేలు అది వారాంతపు రోజుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి' అని ఇంతియాజ్ తెలిపారు.
నోట్లరద్దు ప్రభావంతో ఈసారి నుమాయిష్ తీవ్రంగా నష్టపోతున్నదని ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కార్డు వినియోగించేందుకు ఉద్దేశించిన వెండింగ్ మెషిన్లు ఉంటే ఎంతోకొంత వ్యాపారం జరుగుతున్నదని, అంతేకానీ పీటీఎం వంటి డిజిటల్ సౌకర్యాలు ఉన్నా జనాలు ముందుకురావడం లేదని అంటున్నారు. నిజానికి ఇది ఒక్క ఇంతియాజ్ పరిస్థితి మాత్రమే కాదు. దేశం నలుమూలల నుంచి నుమాయిష్‌కు తరలివచ్చే వ్యాపారులంతా ఈ ఏడాది నోట్లరద్దు ప్రభావంతో చితికిపోతున్నారు. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రదర్శనలోనూ ఆశించినంత గిరాకీ, కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు.