'నేను దావూద్ ఇబ్రహీంను'
న్యూఢిల్లీ: 'నేను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను. అందుకే నన్ను వెంటాడుతున్నారు' అని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వాల్సన్ తంపూ వాపోయారు. తనను లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధక విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో తనను టార్గెట్ చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
తనను అప్రదిష్టపాల్జేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను దావూద్ ఇబ్రహీంలా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన ప్రతి మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మీడియా చేతగానితనాన్ని ఎత్తి చూపడానికి తానేమీ భయపడబోనని స్పష్టం చేశారు.
తనను లైంగికంగా వేధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ను వాల్సన్ తంపూ వెనకేసుకొచ్చారని పరిశోధక విద్యార్థిని ఒకరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆయన ఢిల్లీ మహిళా సంఘం(డీసీడబ్ల్యూ)ను కలిశారు.