నా తప్పుంటే తప్పుకుంటా: తంపూ
న్యూఢిల్లీ: తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే తన ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధమని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ వాల్సన్ తంపూ అన్నారు. పీహెచ్ డీ విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్ సతీశ్ కుమార్ ను కాపాడుతున్నారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
'సమయం వచ్చినప్పుడు రాజీనామా చేస్తా. నాపై మోపిన నిందలు నిజమని నిరూపించినప్పుడు ఉద్యోగాన్ని వదిలేస్తా' అని తంపూ పేర్కొన్నారు. విచారణ సజావుగా సాగకుండా తంపూ అడ్డుపడుతున్నారని బాధిత విద్యార్థిని ఆరోపించింది. ఆయన రాజీనామా చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని పేర్కొంది.
కాగా, తంపూ రాజీనామా చేయాలని పలువురు విద్యార్థులు సోమవారం సెయింట్ స్టీఫెన్స్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు.