Valson Thampu
-
'నేను దావూద్ ఇబ్రహీంను'
న్యూఢిల్లీ: 'నేను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను. అందుకే నన్ను వెంటాడుతున్నారు' అని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వాల్సన్ తంపూ వాపోయారు. తనను లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధక విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో తనను టార్గెట్ చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తనను అప్రదిష్టపాల్జేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను దావూద్ ఇబ్రహీంలా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన ప్రతి మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మీడియా చేతగానితనాన్ని ఎత్తి చూపడానికి తానేమీ భయపడబోనని స్పష్టం చేశారు. తనను లైంగికంగా వేధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ను వాల్సన్ తంపూ వెనకేసుకొచ్చారని పరిశోధక విద్యార్థిని ఒకరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆయన ఢిల్లీ మహిళా సంఘం(డీసీడబ్ల్యూ)ను కలిశారు. -
'నన్ను బంధించారు... పోలీసులు విడిపించారు'
న్యూఢిల్లీ: తనకు ఇవ్వాల్సిన స్టైఫండ్ నిలిపి వేశారని ప్రొఫెసర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ పరిశోధక విద్యార్థిని వాపోయారు. తనను లైబ్రరీలోకి కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను సెయింట్ స్టీఫెన్ కాలేజీ ప్రిన్సిపాల్ వాల్సన్ తంపూ ఖండించారు. తాను బలవంతంగా లైబ్రరీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా తనను గదిలో పెట్టి అటెండర్లు బంధించారని బాధితురాలు తెలిపింది. పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తనను విడిపించారని చెప్పింది. కాగా, తాను ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన నాలుగు ఆడియో టేపులను గతవారం పోలీసులకు ఆమె ఇచ్చింది. ప్రొఫెసర్ సతీశ్ కుమార్ పై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని తనపై ప్రిన్సిపాల్ ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించింది. ఈ కేసును నీరుగార్చేందుకు వాల్సన్ తంపూ ప్రయత్నించారని పేర్కొంది. -
నా తప్పుంటే తప్పుకుంటా: తంపూ
న్యూఢిల్లీ: తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే తన ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధమని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ వాల్సన్ తంపూ అన్నారు. పీహెచ్ డీ విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్ సతీశ్ కుమార్ ను కాపాడుతున్నారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 'సమయం వచ్చినప్పుడు రాజీనామా చేస్తా. నాపై మోపిన నిందలు నిజమని నిరూపించినప్పుడు ఉద్యోగాన్ని వదిలేస్తా' అని తంపూ పేర్కొన్నారు. విచారణ సజావుగా సాగకుండా తంపూ అడ్డుపడుతున్నారని బాధిత విద్యార్థిని ఆరోపించింది. ఆయన రాజీనామా చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని పేర్కొంది. కాగా, తంపూ రాజీనామా చేయాలని పలువురు విద్యార్థులు సోమవారం సెయింట్ స్టీఫెన్స్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. -
దేవుణ్ని నమ్ము..నన్ను నమ్ము..కేసు వెనక్కి తీసుకో
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్ స్టీఫెన్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్‌కు కోర్టులో ఊరట లభించింది. అరెస్టు నుంచి అతనికి మినహాయింపునిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 17 వ తేదీ వరకు వాయిదా వేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తనకు గైడ్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ గత రెండేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని కాలేజీకి చెందిన ఓ పీహెచ్డీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తూ కాలేజీ ప్రిన్పిపల్ తంపూ తనకు ఫోన్లు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన ఆడియో రికార్డులను, మెసేజ్ కాపీలను పోలీసులకు అందించింది. అయితే వీటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ తనకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఆడియో టేపుల సారాంశం దేవుడ్ని నమ్ము, నన్ను నమ్ము....కంప్లయింట్‌ను వెనక్కి తీసుకో...లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్.... పరిస్థితి నా చేయి దాటిపోయింది...నువ్వు వయసులో ఉన్నావ్.. మంచి అమ్మాయిలా ఉండాలి.. నువ్వు సంతోషంగా ఉండాలి..ఇది సెంట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ రెవరండ్ తంపూ మాటలు. ఇపుడివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ప్రిన్సిపల్ ఖండించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉన్నందున ప్రస్తుతం తానేమీ మాట్లాడన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను గతంలోనూ ఖండించిన ఆయన కాలేజీ అంతర్గత కమిటీ విచారణలో పీహెచ్డీ విద్యార్థిని తమకు సహకరించలేదని తెలిపారు. కాగా సతీష్ కుమార్ వేధిస్తున్నాడంటూ 2013 అక్టోబర్‌లో విద్యార్థిని కాలేజీ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో గత నెలలో పచ్చ చీర కట్టుకురా లేదంటే.. యాసిడ్ పోస్తానని సతీష్ కుమార్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ..ఆమె గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోరాటంలో ఢిల్లీలోని మహిళా సంఘాలు విద్యార్థినికి మద్దతుగా నిలిచాయి.