దేవుణ్ని నమ్ము..నన్ను నమ్ము..కేసు వెనక్కి తీసుకో
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్ స్టీఫెన్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్కు కోర్టులో ఊరట లభించింది. అరెస్టు నుంచి అతనికి మినహాయింపునిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 17 వ తేదీ వరకు వాయిదా వేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
తనకు గైడ్గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ గత రెండేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని కాలేజీకి చెందిన ఓ పీహెచ్డీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తూ కాలేజీ ప్రిన్పిపల్ తంపూ తనకు ఫోన్లు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన ఆడియో రికార్డులను, మెసేజ్ కాపీలను పోలీసులకు అందించింది. అయితే వీటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ తనకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు.
ఆడియో టేపుల సారాంశం
దేవుడ్ని నమ్ము, నన్ను నమ్ము....కంప్లయింట్ను వెనక్కి తీసుకో...లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్.... పరిస్థితి నా చేయి దాటిపోయింది...నువ్వు వయసులో ఉన్నావ్.. మంచి అమ్మాయిలా ఉండాలి.. నువ్వు సంతోషంగా ఉండాలి..ఇది సెంట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ రెవరండ్ తంపూ మాటలు. ఇపుడివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వీటిని ప్రిన్సిపల్ ఖండించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉన్నందున ప్రస్తుతం తానేమీ మాట్లాడన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను గతంలోనూ ఖండించిన ఆయన కాలేజీ అంతర్గత కమిటీ విచారణలో పీహెచ్డీ విద్యార్థిని తమకు సహకరించలేదని తెలిపారు.
కాగా సతీష్ కుమార్ వేధిస్తున్నాడంటూ 2013 అక్టోబర్లో విద్యార్థిని కాలేజీ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో గత నెలలో పచ్చ చీర కట్టుకురా లేదంటే.. యాసిడ్ పోస్తానని సతీష్ కుమార్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ..ఆమె గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోరాటంలో ఢిల్లీలోని మహిళా సంఘాలు విద్యార్థినికి మద్దతుగా నిలిచాయి.