
68 ఏళ్లు.. అయినా కుర్రాడినే!
వయసు మీద పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందేమో. 68 ఏళ్ల వయసొచ్చినా తానింకా కుర్రాడినేనని ఆర్జేడీ అధ్యక్షుడు లాలుప్రసాద్ చెబుతున్నారు.
వయసు మీద పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందేమో. 68 ఏళ్ల వయసొచ్చినా తానింకా కుర్రాడినేనని ఆర్జేడీ అధ్యక్షుడు లాలుప్రసాద్ చెబుతున్నారు. బీహార్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు తాను పూర్తి సన్నద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తనకు ఇప్పటికీ కుర్రాళ్లకు ఉన్నట్లే శక్తి సామర్థ్యాలున్నాయని, గత సంవత్సరం తనకు గుండెకు ఆపరేషన్ జరిగినా తన శక్తియుక్తులు ఏమాత్రం తగ్గలేదని ఈ బర్త్డే బోయ్ చెప్పారు.
కాగా, పుట్టినరోజు సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చి లాలుప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. తాను మళ్లీ పూర్తి ఆరోగ్యవంతుడిని అయ్యానని, బీజేపీని.. ప్రధానమంత్రిని కూడా ఇబ్బంది పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా లాలు అన్నారు. బీహార్లో బీజేపీ అధికారంలోకి రాకూడదనే నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు.
కొసమెరుపు: నిజానికి లాలుప్రసాద్కు ఆయన పుట్టినరోజు ఎప్పుడన్నది తెలియదు. అయితే స్కూలు సర్టిఫికెట్లో మాత్రం ఆయన పుట్టినరోజు జూన్ 11 అని ఉంది. దాంతో అదేరోజును కార్యకర్తలు ఆయన పుట్టినరోజుగా చేసుకుంటారు.