
'జయ మృతి తర్వాత నేనే సీఎం అయ్యేవాడిని'
దివంగత నేత జయలలిత మరణించిన వెంటనే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడినని, కానీ సీఎం కావాలని ఆనాడు తాను కోరుకోలేదని అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ అన్నారు.
కోయంబత్తూరు: దివంగత నేత జయలలిత మరణించిన వెంటనే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడినని, కానీ సీఎం కావాలని ఆనాడు తాను కోరుకోలేదని అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ అన్నారు. తాను సీఎం పదవి తిరస్కరించడంతోనే శశికళ.. పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా నియమించారని చెప్పుకొచ్చారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శశికళ సైతం సీఎం పదవి చేపట్టే అవకాశమున్నా.. ఆమె కూడా ఆ పని చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు శశికళను, తనను పక్కనబెట్టి పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు శశికళను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఇటీవల విలీనమై.. అన్నాడీఎంకే నుంచి శశికళను, దినకరన్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పళనిస్వామి ప్రభుత్వంపై దినకరన్ తిరుగుబాటు లేవనెత్తారు.