బీజేపీతో మాకు ముప్పులేదు
భువనేశ్వర్: బీజేపీ నుంచి ప్రాంతీయ పార్టీలకు ముప్పు ఉందని తాను భావించడం లేదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందని పేర్నొన్నారు.
గురువారం భువనేశ్వర్ వచ్చిన మమత.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఒడిశాలో బిజూ జనదళ్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. భువనేశ్వర్‌లో ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు భేటీ కావడం ప్రాధాన్యం ఏర్పడింది. మమత, పట్నాయక్ ఇద్దరూ 15 నిమిషాలు సమావేశమయ్యారు. రాజకీయాల గురించి చర్చించలేదని, మర్యాదపూర్వకంగా పట్నాయక్‌ను కలిశానని మమత చెప్పినా.. బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసే దిశగా మంతనాలు జరిపినట్టు భావిస్తున్నారు. ఈ సందర్బంగా మమత బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ.. ప్రతిఒక్కరిని, ప్రజలను, రాజకీయ పార్టీలను కూడా విభజిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను, మంత్రులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. 2019లో ఒడిశా, 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.