ఎయిర్‌సెల్ స్కాం: మౌనం వీడిన చిదంబరం!
ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణంపై తాజాగా కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం స్పందించారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సాధారణ ప్రక్రియలో భాగంగానే తాను అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. 'ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో విదేశీ పెట్టుబడుల విలువను పరిగణించి.. ఎఫ్‌ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు) ఆర్థికమంత్రికి నివేదిక సమర్పించి.. ఆమోదం కోరుతుంది. ఒక ఆర్థికమంత్రిగా సాధారణ ప్రక్రియలో భాగంగానే నేను అనుమతి ఇచ్చాను' అని చిదంబరం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో వివిధ అంశాలపై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సీబీఐను సుప్రీంకోర్టు సోమవారం కోరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నేత, పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ తనకు సమాధానం ఇచ్చిందని, ఈ ఒప్పందానికి 2006లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ఇచ్చిన ఎఫ్‌ఐపీబీ అనుమతిని కూడా విచారిస్తున్నామని సీబీఐ స్పష్టం చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ఎఫ్‌ఐపీబీ అనుమతి ఇచ్చారని, ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందాన్ని నిజానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కు నివేదించాల్సి ఉండేదని స్వామి కోర్టులో వాదించారు. నిబంధనల ప్రకారం రూ. 600 కోట్ల పైచిలుకు విదేశీ పెట్టుబడుల వ్యవహారాలన్నింటినీ సీసీఈఏకు నివేదించాల్సి ఉంటుందని, కానీ రూ. 3,500 కోట్ల విలువచేసే ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందాన్ని సీసీఈఏకు నివేదించడానికి బదులు చిదంబరమే స్వయంగా ఆమోదం తెలిపారని స్వామి తప్పుబట్టారు. అయితే, ఈ వ్యవహారంలో తాను నిబంధనలన్నింటినీ పాటించినట్టు చిదంబరం తాజా ప్రకటనలో వివరణ ఇచ్చారు.