‘15 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది’
లక్నో: అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి తాను 15 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ తెలిపారు. పార్టీ కార్యకర్తగా 15 ఏళ్లు కిందిస్థాయిలో పనిచేశానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయాలనేది తమ పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని, తాను సామాన్య కార్యకర్తనని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నోయిడా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పంకజ్ సింగ్ పోటీ చేయనున్నారు. 155 స్థానాలకు ఆదివారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. రాజ్ నాథ్ తనయుడు కావడంతో పంకజ్ పై అందరి దృష్టి నెలకొంది. యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు.