సైకిల్ గుర్తు నేతాజీదే
సమాజ్వాద్ పార్టీని, సైకిల్ గుర్తును పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, తనకు ప్రధాని అయ్యే లక్ష్యమేమి లేదని తేల్చిచెప్పేశారు.
లక్నో : సమాజ్వాద్ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన సైకిల్ గుర్తు నేతాజీదేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. తండ్రికొడుకుల సంబంధం ఎప్పటికీ విడదీయరానిది ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన ఈవెంట్లో పేర్కొన్నారు. నేతాజీ ఆశీర్వాదాలు ఎప్పటికీ తన కొడుకు ఉంటాయన్నారు. తమ ప్రచారంలో నేతాజీ ఫోటోలను వాడతాం.. తమ ప్రతి స్లోగన్లో నేతాజి ఉంటారు. పొత్తుకోసం నేతాజీ కూడా ప్రచారం నిర్వహించబోతున్నారంటూ అఖిలేష్ తెలిపారు. ఒకవేళ ఎస్పీ గెలిస్తే అత్యంత ఎక్కువగా సంతోషపడేది నేతాజీనేనని పేర్కొన్నారు. తండ్రి కొడుకుల బంధం అన్ని సందర్భాల్లో అలాగే ఉంటుందని, ఏం మార్పులుండవని అఖిలేష్ చెప్పారు. ఇటీవల తండ్రి, ఎస్పీ సుప్రిం ములాయం సింగ్ యాదవ్తో అఖిలేష్కు తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే.
తనకు ప్రధాని అయ్యే లక్ష్యమేమి లేదని తేల్చిచెప్పేశారు. రాష్ట్రంలోనే తన బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఢిల్లీకి దూరంగా ఉన్న వ్యక్తులే చాలా సంతోషంగా ఉంటారని అంటూ ప్రధాని అయ్యే ఉద్దేశ్యాలేమి లేవని తేలికగా చెప్పేశారు. ఈ సారి యూపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ పొత్తు కచ్చితంగా పూర్తి మెజార్టీతో గెలుపు కెరటం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 403 సీట్లు కలిగిన సభలో, 300 పైగా సీట్లు తామే గెలుపొందుతామన్నారు. తమ ప్రభుత్వం అందించిన పథకాలతో లబ్ది పొందిన ప్రతిఒక్కరూ తమకు ఓటువేస్తారని చెప్పారు. దీంతో తాము 300 సీట్లు సంపాదిస్తామన్నారు. 55 లక్షల మంది మహిళలకు సమాజ్వాద్ పెన్షన్, 18 లక్షల ల్యాప్టాప్ల సప్లై, కన్య విద్యా ధన్ యోజన, మెడికల్ సీట్లు రెట్టింపు వంటి పలు పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన చెప్పారు.