ఆత్మహత్యే కావచ్చు..
కార్ల్ స్లిమ్ మృతిపై థాయ్‌లాండ్ పోలీసుల ప్రాథమిక అంచనా
గదిలో పెనుగులాట జరిగిన ఆధారాల్లేవు
సూసైడ్ నోట్‌లో ఇంటి సమస్యల ప్రస్తావన ఉన్నట్లు వెల్లడి
స్లిమ్ భార్యను ప్రశ్నిస్తాం: పోలీసులు
బ్యాంకాక్/న్యూఢిల్లీ: టాటా మోటార్స్ మేనేజింగ్ డెరైక్టర్ కార్ల్ స్లిమ్ (51) ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే సంగతి ఇంకా ఇదమిత్థంగా వెల్లడి కాలేదు. ఆయన ఆత్మహత్యకు పాల్ప డి ఉంటారనే అభిప్రాయాన్ని థాయ్‌లాండ్ పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. బ్యాంకాక్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో 22వ అంతస్తు నుంచి 4వ అంతస్తులో పడి ఆదివారం ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడం తెలిసిందే. కార్ల్ స్లిమ్ హత్యకు గురై ఉండే అవకాశాల్లేవని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ‘యన్నావా జిల్లాలోని రివర్‌సైడ్ షాంఘ్రి-లా హోటల్‌లో స్లిమ్ బస చేసిన గదిలో 3 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నాం. అందులో కొంతవరకూ ఇంటి సమస్యల ప్రస్తావన ఉంది. ఆ లేఖను రాసింది ఆయనేనా కాదా? అన్నది పోలీసులు విశ్లేషిస్తున్నారు. బ్రిటిష్ జాతీ యుడైన స్లిమ్ బసచేసిన గదిలో పెనుగులాట జరిగిన దాఖలాల్లేవు.
స్లిమ్ ఈ నెల 24న తన భార్య(30)తో కలసి హోటల్ రూములో దిగారు. ఆదివారం (26న) వారు ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గదికి బాల్కనీ లేదు. పెద్ద అద్దం, దానికో చిన్న కిటికీ ఉన్నాయంతే. దానిలోంచి బయటపడటం చాలా కష్టం. నాలుగో అంతస్తులోకి పడి మరణించిన స్లిమ్ దేహాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. గదిలో నిద్రిస్తున్న ఆయన భార్యకు ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలయ్యారు. స్లిమ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనేది మా ప్రాథమిక అంచనా’ అని పోలీస్ లెఫ్టినెంట్ సోమ్యోట్ బూన్యకియోవ్ తెలి పారు. స్లిమ్ భార్యను కూడా ప్రశ్నిస్తామని చెప్పారు. కాగా, కార్ల్ స్లిమ్ మరణం నేపథ్యంలో... టాటా మోటార్స్ కొత్త ఎండీ నియామకం త్వరలో జరగనుంది. కొద్ది రోజుల్లోనే డెరైక్టర్ల బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.