
రేప్‌కి గురై రాటుతేలాను: పాప్‌స్టార్ మడొన్నా
లాస్‌ఏంజెలెస్(ఐఎఎన్ఎస్): మడోనా- పాప్ సంగీత ప్రపంచంలో రారాణి. పుట్టిన తేదీ లెక్కల ప్రకారం ఆమెకి 55 ఏళ్లే అయినా, వయసుతో పాటు పెరిగే యవ్వనం ఆమె. తన స్వరంతో కొత్త లోకాలు కల్పించి, యువతకి కానుక చేసే ఆ స్వర సామ్రాజ్ఞి తొలినాళ్లలో అత్యాచారానికి గురి అయ్యిందంటే కొన్ని కోట్ల హృదయాలు తల్లడిల్లుతాయి. తాను కూడా ఒకప్పుడు అత్యాచార బాధితురాలినేని పాప్‌స్టార్ మడొన్నా స్వయంగా వెల్లడించారు. రేప్‌కి గురై జీవితపాఠాలు నేర్చుకున్నానని కూడా పాప్ క్వీన్ మడోనా తెలిపారు. తన మీద జరిగిన అత్యాచారం పోరాట పటిమ నేర్పినట్లు పేర్కొన్నారు. తాను ఆనాడు పడ్డ నరకయాతనని మడోనా తొలిసారిగా బైటపెట్టారు.
ఆ భయంకరమైన సంఘటన వివరాలను ‘హార్పర్‌బజార్’ అనే మ్యాగజైన్ నవంబర్ సంచిక గెస్ట్ కాలంలో ఆమె వివరించారు. తుపాకీ గురిపెట్టి కొందరు తనను అత్యాచారం చేశారని మడోన్నాతెలిపారు. తాను న్యూయార్క్‌కు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. న్యూయార్క్‌కు వచ్చిన కొత్తలో జరిగిన సంఘటనలు, తన అంతర్గత విషయాలను ఈ వ్యాసంలో ప్రస్తావించారు. 'బిగ్ ఆపిల్' అన్న ముద్దు పేరుతో పిలవబడే న్యూయార్క్ నగరానికి తాను వచ్చినప్పటి అనుభవాల్ని ఆమె ఆ వ్యాసంలో రాశారు. "న్యూయార్క్ నేను అనుకున్నంత గొప్ప ప్రాంతమేమీ కాదు...ఇక్కడికి వచ్చిన ఏడాదిలోనే నా ఇంటిపై దుండగులు మూడుసార్లు దాడి చేశారు... తుపాకీ గురిపెట్టి, కత్తితో బెదిరించి బిల్డింగ్‌పైకి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేశారు... నా దగ్గర విలువైన వస్తువులు లేనప్పటికీ నా రేడియోను కూడా తీసుకెళ్లారు.’ అని అప్పుడు జరిగిన సంఘటన గురించి మడొన్నా మొదటిసారిగా ప్రపంచానికి తెలిపారు. ఆ సంఘటనే తనను మరింత ధృడంగా తయారుచేసిందని పేర్కొన్నారు. తనకు జీవితంలో పోరాడే శక్తిని ఇచ్చింది కూడా ఆ సంఘటనేనని తెలిపారు.