
'ములాయం ప్రధాని, రాహుల్ ఉప ప్రధాని'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అభ్యంతరం లేదని సమాజ్ వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తెలిపారు. రాహుల్ గాంధీ తనకు పాత మిత్రుడని చెప్పారు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను ప్రధాని, రాహుల్ గాంధీని ఉప ప్రధాని చేస్తామంటే కాంగ్రెస్ తో చేతులు కలుపుతామని అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమిట్ లో శుక్రవారం ఆయన ప్రసంగించారు.
అవసరాలకు అనుగుణంగానే రాజకీయాలు చేస్తుంటామని తెలిపారు. ములాయం సింగ్ పుట్టినరోజు వేడుకలను వివాదం చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు వివాదస్పద ప్రకటనలు చేస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అఖిలేశ్ చెప్పుకొచ్చారు. అయితే తాము చేసిన పనుల గురించి చెప్పుకోవడంలో వెనకబడ్డామని ఒప్పుకున్నారు.