డబ్బుంటే జైల్లో కూడా దర్జానే | if have money can enjoy in the jail | Sakshi
Sakshi News home page

డబ్బుంటే జైల్లో కూడా దర్జానే

Published Fri, Jul 14 2017 6:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

if have money can enjoy in the jail



న్యూఢిల్లీ:
‘నీకు డబ్బుంటే నీకు కావాల్సినదాన్ని పొందవచ్చు. నేనెప్పుడూ ఒకటే చెబుతాను, జైలనేది పేద ప్రజలకు మాత్రమే నరకం’ అని అంకా నియాక్సు అలియాస్‌ అంకా వర్మ, తాను జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు చెప్పిన మాటలివి. ఆమె తీహార్‌ జైల్లో ఉన్న నాలుగేళ్లు దర్జాగా బతికారు. పది అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న జైలు గదిలో కావల్సినంత ప్రైవసీని అనుభవించారు. జైలు గదిలోనే యూరోపియన్‌ కమోడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ ఏర్‌ బ్రష్‌ను వాడేవారు. రకరకాల సబ్బులు, షాంపోలతో శుభ్రంగా స్నానం చేసేవారు. జుట్టుకు రంగేసుకునేవారు. జెల్స్‌ను పూసుకునేవారు. కావాల్సిన ఆహార పదార్థాలను బయటి నుంచి తెప్పించుకునేవారు. కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు విహార యాత్రకు వెళ్లినట్లుగా బయటే ఇష్టమైన భోజనం చేసేవారు. జైలు గదిలో 14 అంగుళాల ఎల్‌సీడీ టీవీ ఉండేది, వాటిలో 29 శాటిలైట్‌ ఛానళ్లు వచ్చేవి.

ఇన్ని సౌకర్యాలను ఆమె జైలులో అధికారులకు లంచం ఇవ్వడం ద్వారానే సాధించుకోలేదు. జైలు మాన్యువల్, చట్టాల్లో ఉన్న లోపాలను ఉపయోగించుకొని కూడా సాధించుకున్నారు. అన్నింటిలోనూ ప్రధాన పాత్ర వహించిందీ డబ్బే. తన అవసరాల కోసం ఎప్పూడూ లాయర్లకు, డాక్టర్లకు, జడ్జీలకు పిటిషన్లమీద పిటిషన్లు పెట్టుకునేవారు. ఓసారి రాష్ట్రపతికి కూడా పిటిషన్‌ను పెట్టుకున్నారు. జైలు మాన్యువల్‌లోని 6వ సెక్షన్, 30వ పేరా ప్రకారం కొన్ని సందర్భాల్లో బయటి నుంచి భోజనం, అవసరమైన దుస్తులు తెప్పించుకోవచ్చు. అయితే ములాకత్‌ సందర్భాల్లోనే తెప్పించుకోవాలి. డబ్బును ఎరగావేస్తే ఎన్నిసార్లయినా ములాకత్‌ల కుదురుతాయి.

అందుకని అంకావర్మ తన జైలు గదిని వార్డ్‌రోబ్‌గా మార్చుకున్నారు. తాను రొమానియా మాజీ సుందరి అవడం వల్ల రకరకాల దుస్తులు ధరించి దర్జాగా తన భర్త అభిషేక్‌ వర్మతో కలసి కోర్టుల్లో కేసుల విచారణకు హాజరయ్యేది. తన దుస్తులు, తన అందం ద్వారా జడ్జీలను ఇంప్రెస్‌ చేయాలని కూడా ఆమె భావించారు. ఓ సందర్భంలో ‘జడ్జీలు నా దుస్తులు, అందం చూడకుండా కేసులు చూస్తారేం’ అని మీడియాతోని వ్యాఖ్యానించారు కూడా. ఆమె కోర్టు అనుమతితో మూడువేల రూపాయల బ్రాండెడ్‌ హైహీల్స్‌ చెప్పులను జైలుకు తెప్పించుకున్నారు. హైహీల్స్‌తో జైల్లో ఓ మహిళను కొట్టారన్న ఆరోపణ ఆమెపై ఉన్నప్పటికీ ఆమె హైహీల్స్‌కు అనుమతి తీసుకోగలిగారు.
 
ఆమె భర్త అభిషేక్‌ వర్మ ప్రముఖ ఆయుధాల వ్యాపారి. భారత రక్షణ శాఖకు ఆయుధాలను, జలాంతర్గాములను సరఫరా చేయడంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలపై 2012లో ఇరువురిపై మూడు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక కేసు ఆదిలోనే వీగిపోగా, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు 2017, ఏప్రిల్‌ నెలవరకు కొనసాగాయి (2006లో కూడా ‘నేవీ వార్‌ రూమ్‌ లీక్‌ కేసు’ కూడా అభిషేక్‌ వర్మపై దాఖలైంది). భారత రక్షణ సహాయ మంత్రిగా పల్లంరాజు ఉన్నప్పుడు ఆయన్ని అంకా వర్మ కలసుకోవడం భారత రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ఈ కేసుల్లో 2016, మే 20వ తేదీన అంకా వర్మకు బెయిల్‌ లభించింది. అప్పటివరకు అంటే నాలుగేళ్లపాటు ఆమె జైల్లోనే గడిపారు. 2017, ఏప్రిల్‌ నెలలో సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా వారిద్దరిపై కేసులు కొట్టేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ కర్నాటక కారాగారంలో జైలు అధికారులకు రెండు కోట్ల రూపాయలు చెల్లించి రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అంకా వర్మ కథనాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది.

(అంకావర్మ, పీఠర్‌ ముఖర్జీ, అమర్‌సింగ్, పప్పూయాదవ్, కోబాడ్‌ గాంధీ, ఏ. రాజా లాంటి హైప్రొఫైల్‌ వ్యక్తులు జైల్లో ఉన్నప్పుడు ఎలా బతికారన్న అంశంపై ‘బిహాండ్‌ బార్స్‌’ పేరిట సునేత్ర చౌధురి రాసిన పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ ప్రత్యేక కథనం)


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement