పెళ్లి బరాత్ లేటైయితే ఫైన్
రాంపూర్: బాజా భజంత్రీలు, బాణాసంచా పేలుళ్ల మధ్య అశ్వారోహుడై తాపీగా సాగిపోతున్న పెళ్లి కొడుకు సవారియా...ఆగవే! అంటే ఇక కుదరదు తాంకుపురి తాండా గ్రామంలో. ఏది ఏమైనా పెళ్లి ముహుర్తానికి ముందే పెళ్లి కొడుకు బరాత్ పెళ్లి పందిరికి చేరుకోవాల్సిందే. అలా జరగని పక్షంలో పెళ్లి కొడుకు తరఫువారు భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే. ఇది కొత్తగా అమల్లోకి వచ్చిన ఉత్తరప్రదేశ్‌లోని తాంకుపురి తాండా గ్రామం కట్టుబాటు.
అనుకున్న సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా నిమిషానికి వంద రూపాయల చొప్పున పెళ్లి కొడుకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు గ్రామ పెద్దలు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల్లో పెళ్లి కొడుకుల బరాత్‌లు తెల్లార్లు సాగడం అతి సాధారణం. అర్ధరాత్రి వేళ మేలతాళాలు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ నింపాదిగా పెళ్లి కొడుకు బరాత్ వీధులు గుండా సాగితే వీధుల్లోని ప్రజలకు నిద్రాభంగం అవుతుందనీ, అలాగే పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లి పందిట్లో పడిగాపులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఈ ఏర్పాటు చేశారట. అంతేకాదు, గ్రామ ప్రజల గాఢ నిద్రను, పెళ్లి ఖర్చుల పొదుపును దృష్టిలో పెట్టుకొని గ్రామ పెద్దలు మరిన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చారు.
బరాత్‌లో బాజా భజంత్రీలు మోగించరాదని, బాణసంచా కాల్చరాదని, పెళ్లి భోజనాల్లో ఏ మాత్రం ఆహారపదార్థాలను వృధా చేయరాదని కూడా షరతులు విధించినట్టు గ్రామం మతగురువు మౌలానా అర్షాద్ తెలిపారు. అంతేకాదండోయ్! పిల్లను ఇచ్చి పుచ్చుకోవడం గ్రామస్థుల మధ్యనే జరగాలని, పొరుగూరు పెళ్లి సంబంధాలు చేసుకోరాదనికూడా గ్రామ పెద్దలు కట్టుబాటు చేసుకున్నారు. ఇదేం కట్టుబాటంటూ ఇప్పటికే పొరుగింటి పిల్లతో ప్రణయ కలాపాం సాగిస్తున్న కుర్రకారు కస్సుబుస్సులాడుతున్నారు.