రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రహదారులు
(గుంటూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం రూ.కోట్లు కొట్టేసే ప్రయత్నాలకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో రోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజధాని ప్రతిపాదిత గ్రామాలను కలుపుతూ రూ.30 కోట్ల నిధులతో పలు ప్యాకేజీల కింద రోడ్ల నిర్మాణానికి ఆగస్టు 22న టెండర్లు పిలిచారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి రాజధాని శంకుస్థాపన జరిగే ఉద్దండ్రాయునిపాలెంకు వెళ్లేందుకు మూడు ప్యాకేజీలుగా, మంగళగిరి నుంచి రాయపూడి వరకు నాలుగు ప్యాకేజీలుగా పనులు విభజించి టెండర్లు ఆహ్వానించారు. బిడ్ వ్యాలిడిటీ గడువు 90 రోజులుగా పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారం రోజుల్లోనే టెండర్లు తెరిచి అధికార పార్టీ నేతలకు పనులు అప్పగించేశారు. పనులన్నిటినీ దాదాపు నామినేషన్ విధానంలోనే కట్టబెట్టడం గమనార్హం. పైగా టర్న్‌కీ విధానంలో (అంటే.. ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు, పంచాయతీ రాజ్ శాఖల కింద చేపట్టే పనులన్నిటినీ ఒకే శాఖ చేపట్టడం) ఏకపక్షంగా అప్పగించారు.
ఎస్టిమేట్ కాపీలో నిబంధనలేవీ?
కిలోమీటరుకు రూ.కోటిన్నర ఖర్చుతో రూపొందించిన ఈ పనుల్లో ఆర్‌అండ్‌బీ అధికారులు అసలు నిబంధనలేవీ పేర్కొనలేదు. రోడ్డు విస్తరణ ఎంత వరకు.. సైడ్ డ్రెయిన్ల నిర్మాణం తదితరాలన్నీ అంచనా ప్రతిలో పొందుపరచలేదు. ఉండవల్లి-యర్రబాలెం వయా పెనుమాక వెళ్లే రహదారిని మూడు ప్యాకేజీల కింద రూ.12.96 కోట్లతో చేపట్టారు. సైడ్ డ్రెయిన్లు, సీసీ పేవ్‌మెంట్ల నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.30 కోట్లతో చేపట్టే ఈ పనుల్లో 22 శాతం(రూ.6 కోట్ల మేర) అవినీతి జరుగుతోందని క్వాలిటీ కంట్రోల్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. రాజధాని రోడ్ల పేరిట జరుగుతున్న ఈ అవినీతిపై వివరణనిచ్చేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు నిరాకరిస్తున్నారు.
అసలు మతలబు...
ఈ టెండరు ఖరారు కాకపోవడం వెనుక సత్తెనపల్లి నియోజకవర్గ ముఖ్యనేత కుమారుని హస్తం ఉందని తెలుస్తోంది. ఆ నియోజకవర్గానికి చెందిన ఒక నిర్మాణ సంస్థ టెండరులో పాల్గొన్నదని, దానికే ఆ టెండరు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఈ తతంగం జరుగుతోందని మిగిలిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఎస్‌ఈ జయరాజ్‌ను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా, ఆ రోడ్డు అలైన్‌మెంట్ మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, త్వరలో టెండరు రద్దు చేసి, నిర్మాణ సంస్థల ఈఎండీలు ఇచ్చేసి కొత్త టెండరు పిలుస్తామని తెలిపారు.
ఐతే నామినేషన్.. లేకుంటే పెండింగ్
అర్హతలు, అనుభవం కంటే సిఫారసులున్న నిర్మాణ సంస్థలు రూ.కోట్ల విలువైన పనులు పొందుతున్నాయి. అంచనాలు, టెండర్లు, అగ్రిమెంట్లతో నిమిత్తం లేకుండా పనులు చేసేస్తున్నాయి. పాలకుల సూచనల మేరకు నిర్మాణ సంస్థల టెండర్లను పరిశీలించడమే లేదు. టెండర్ల ఖరారుపై కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఉపయోగం లేకపోవడంతో ఈఎండీ(ఎర్నెస్ట్‌మనీ డిపాజిట్)లనైనా తిరిగి ఇచ్చేయాలని నిర్మాణ సంస్థలు అధికారులను వేడుకుంటున్నాయి. గత నెలలో గుంటూరు పంచాయతీరాజ్ కార్యాలయంలో ఆహ్వానించిన టెండరును ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.
ఉద్దండరాయునిపాలెం గ్రామానికి వెళ్లే రహదారికి పంచాయతీరాజ్ అధికారులు టెండరు ఆహ్వానించారు. పెనుమాక నుంచి కృష్ణాయపాలెం, ఉద్దండరాయుని పాలెం వరకు రహదారి నిర్మించేందుకు రూ.8.75 కోట్లతో అంచనాలు రూపొందించారు. టెండర్ ప్రక్రియకు గత నెల 20న చివరిరోజు నాటికి ఐదు నిర్మాణ సంస్థలు... సాయినాథ్ కన్‌స్ట్రక్షన్స్(ఒంగోలు), వీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్(పిడుగురాళ్ల), పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్(సత్తెనపల్లి), యూబీఎస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు(గుంటూరు), రామ్మోహన్‌రెడ్డి కన్‌స్ట్రక్షన్స్(నెల్లూరు) ఈ టెండరులో పాల్గొన్నాయి. కొన్ని సంస్థలు అంచనా కంటే తక్కువ రేటుకు టెండరు వేశాయి.
అయితే, వీటిని ఇప్పటి వరకు అధికారులు పరిశీలించనే లేదు. వాటిని పరిశీలించకపోవడంతో కనీసం ఈఎండీ మొత్తాలను తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. టెండరు అంచనా మొత్తంపై ఒక శాతం ఈఎండీగా ఒక్కో నిర్మాణ సంస్థ రూ.8.75 లక్షలను చెల్లించాయి. టెండర్లు ఖరారు చేయక, ఈఎండీని తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాణ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు నామినేషన్‌పై అనేక నిర్మాణ సంస్థలు అవే పనులను చకచకా చేసేస్తున్నాయి.