ఐఐటీ ఫీజు మూడురెట్లు
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆమోదమే తరువాయి
{పతి విద్యార్థికీ తనఖాలేని వడ్డీ రహిత రుణం
న్యూఢిల్లీ: ఐఐటీల్లో విద్యాభ్యాసానికి అయ్యే వార్షిక ఫీజులను మూడురెట్లు పెంచే ప్రతిపాదన (ప్రస్తుత ఫీజు రూ. 90 వేలు)కు ఐఐటీ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఈ పెంపును కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆమోదించాల్సి ఉంది. దీంతోపాటు, ఐఐటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల యోగ్యత తెలుసుకునేందుకు నేషనల్ అథారిటీ ఆఫ్ టెస్ట్ (న్యాట్) రూపొందించే పరీక్షను 2017 నుంచి నిర్వహించాలని కూడా ఐఐటీ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌సీఐసీ) నిర్ణయించింది. ఐఐటీ బాంబే డెరైక్టర్ దేవాంగ్ ఖాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీ.. ఫీజును మూడు లక్షల రూపాయలకు పెంచడంతో పాటు, ఐఐటీల ఆర్థిక వనరులను పెంచుకునే వివిధ మార్గాలను సూచించింది. అయితే, ఫెలోషిప్‌తో చదువుకునే పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు కూడా ఈ పెంపును వర్తింపచేసే అవకాశాన్ని పరిశీలించాలని సబ్ కమిటీని ఎస్‌సీఐసీ కోరినట్లు తెలిసింది.
ప్రతి ఐఐటీ విద్యార్థికి విద్యాలక్ష్మి పథకం కింద ఎలాంటి తనఖా పెట్టుకోకుండా.. వడ్డీ రహిత రుణాన్ని అందించాలని కూడా కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఎస్‌సీఐసీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి ఆమోదం లభిస్తే.. విదేశీ విద్యార్థులు కూడా ప్రస్తుతమున్న 4వేల డాలర్లకు బదులుగా 10వేల డాలర్ల ఫీజు కట్టా ల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు.. కనీసం ఎనిమిది దేశాల్లో ఐఐటీ పరీక్షను నిర్వహించాలని కూడా ఎస్‌సీఐసీ నిర్ణయించింది. ఐఐటీ విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించేలా అశోక్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (జేఈఈలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష) ను వచ్చే ఏడాది నుంచి నిర్వహించనున్నారు. ఐఐటీ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ఆన్‌లైన్లోనే ప్రభుత్వం కోచింగ్ అందించాలని కూడా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.