ఐఐటీలో చదివి.. 420 కోట్లు దోచేశాడు!
ఐఐటీలో చదివి, ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లాంటి అగ్రగామి సంస్థ నుంచి పట్టభద్రుడై.. అమెరికాలో మంచి ఉద్యోగంలో చేరిన ఓ వ్యక్తి.. ఆ కంపెనీ నుంచి దాదాపు 420 కోట్ల రూపాయలు కొట్టేశాడట! చాలాకాలం పాటు అదే కంపెనీలో వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేసిన ఇఫ్తికార్ అహ్మద్ ఇప్పుడు భారతదేశంలో దాగున్నాడని అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలకు ముందు ఏదో ఒక సమయంలో అమెరికా నుంచి పారిపోయాడని, ఇప్పుడు ఎక్కడున్నదీ తెలియడంలేదని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసీ) వర్గాలు అంటున్నాయి.
క్రిమినల్ ఇన్సైడర్ ట్రేడింగుకు పాల్పడిన అహ్మద్, జడ్జి ఉత్తర్వులను ఉల్లంఘించి పారిపోయాడని చెబుతున్నారు. ఓక్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్లో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న అహ్మద్, తన క్లయింట్లను కోట్లాది డాలర్ల మేర మోసగించినట్లు ఆరోపణలున్నాయి. అతడి స్నేహితుడు అమిత్ కనోడియాతో కలిపి అహ్మద్ను ఏప్రిల్ నెలలో అరెస్టు చేశారు. అతడు దొరికి, నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.