36 రాఫేల్ యుద్ధ విమానాలే కొంటాం
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు ఫ్రాన్స్ నుంచి 126 రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, అది ఆర్థికంగా కూడా సాధ్యపడదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం 36 రాఫేల్ జెట్‌లను మాత్రమే కొనుగోలు చేస్తుందని, వీటిని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగిస్తామని ఆదివారమిక్కడ చెప్పారు. వాయు సేన అవసరాల మేరకే వీటిని కొనుగోలు చేస్తున్నామని, అంతకుమించి కొనుక్కోబోమని అన్నారు.
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రారంభించిన టెండర్ ప్రక్రియను కూడా తప్పుపట్టారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను, రక్షణ సేకరణ మండలిని నిర్వీర్యం చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు.