- వెంటనే బలపరీక్ష నిర్వహించాలి
- గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వండి
-
రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్ష సభ్యులు
న్యూఢిల్లీ: తమిళ రాజకీయ ప్రకంపనలు ఢిల్లీకి చేరాయి. సీఎం పళనిస్వామికి మెజారిటీ లేదని, తమిళనాడు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి.. బలపరీక్షను నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. రాష్ట్రపతిని కలిసినవారిలో డీఎంకే, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అన్నాడీఎంకేలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళని సర్కారు మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. సీఎం పళని వర్గానికి మెజారిటీ లేకపోయినా.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఆయన వైఖరి ఉందని ప్రతిపక్ష సభ్యులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో వెంటనే అసెంబ్లీ సమావేశపరిచి.. బలపరీక్ష నిర్వహించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్రపతిని కోరారు. అనంతరం సీపీఎం నేత ఏచూరి, సీపీఐ నేత రాజా, డీఎంకే నేత స్టాలిన్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ వైఖరికి లేఖే కారణమా?
దినకరన్ వర్గం పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ.. గవర్నర్ విద్యాసాగర్‌రావు చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు అందించిన లేఖలో పొరపాట్లు ఉన్నాయని, అందువల్లే తాము చర్య తీసుకోవడం లేదని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. తాము అన్నాడీఎంకే ఎమ్మెల్యేలమే అయినప్పటికీ, పళనిస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం లేదని, బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వం తిరుగుబాటు చేస్తే.. అది పార్టీ అంతర్గత విషయం అవుతుందని, అప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకొని గవర్నర్‌కు తెలియజేయవచ్చునని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తమకు మెజారిటీ లేదన్న విపక్షాల వాదనను అన్నాడీఎంకే తోసిపుచ్చుతోంది. పళనికి పూర్తిస్థాయిలో సంఖ్యాబలముందని చెప్తోంది.