అప్పుడే కొత్త నోట్లతో అవినీతి స్టార్ట్!
అహ్మదాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా సంక్షోభంలో కూరుకోగా.. ఓ ఇద్దరు మాత్రం ప్రభుత్వం జారీచేస్తున్న కొత్త నోట్లతో అవినీతికి తెరతీశారు. రూ.2.5 లక్షల లంచం తీసుకున్న ఓ ఇద్దరు గుజరాత్ పోర్ట్ ట్రస్ట్ అధికారులు అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. మరో రూ.40వేలను ఓ అధికారి ఇంటినుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే లంచం తీసుకున్న మొత్తమంతా నవంబర్ 11 నుంచి బ్యాంకుల్లో కొత్తగా జారీచేస్తున్న రూ.2000 నోట్లదే కావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
బ్లాక్మనీని నిరోధించడానికి ప్రభుత్వం పాత పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయగా.. లంచగొండులు కొత్త నోట్లతో అవినీతికి పాల్పడుతున్నారు. కండ్లా పోర్ట్ ట్రస్ట్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ శ్రీనివాసు, సబ్ డివిజనల్ ఆఫీసర్ కే కాంటేకర్లు, ఓ ప్రైవేట్ ఎలక్ట్రిక్ సంస్థ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి రూ.4.4 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారని గుజరాత్ అవినీతి నిరోధక బ్యూరో అధికారులు చెప్పారు.
నవంబర్ 15న ఈ ఇద్దరు అధికారులకు మధ్యవర్తితగా వ్యవహరించిన రుద్రేషర్ అనే వ్యక్తి సంస్థ నుంచి రూ.2.5 లక్షలు వసూలు చేయడానికి అంగీకరించినట్టు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి కేపీటీ అధికారులు కోరిన లంచం వివరాలను ఆ సంస్థ యజమానులు ఏసీబీ అధికారుల వద్ద ఫిర్యాదుచేశారు. అవినీతిని ట్రాప్ చేసిన ఏసీబీ, మధ్యవర్తితిగా వ్యవహరించిన రుద్రేషర్ను, ఆ ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుంది.
శ్రీనివాస్ అనే ఇంట్లో మరో రూ.40వేల కొత్త కరెన్సీ నోట్లను కూడా అధికారులు స్వాధీనంచేసుకున్నారు. ఇంతమొత్తంలో కొత్త నోట్లు వారి దగ్గరకు ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. కాగ, పాత నోట్ల రద్దుతో కనీస అవసరాలకు డబ్బులు కూడా లేక ప్రజలు కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, అధికారులు మాత్రం కొత్త నోట్లతో అవినీతి తెరతీశారు.