భారత్ పుండుపై చైనా కారం!
- మసూద్ అజార్ విషయంలో డ్రాగన్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై నిషేధం విషయంలో పుండుపై కారం చల్లినట్లు భారత్ పట్ల చైనా వ్యవహరిస్తోంది. మసూద్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలన్న భారత్ తీర్మానాన్ని అడ్డుకున్న చైనా.. ఈ విషయంలో మన దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాద నిరోధం పేరిట రాజకీయ లబ్ధి పొందేందుకు భారత్ ప్రయత్నిస్తున్నదని అక్కసు వెళ్లగక్కింది.
మసూద్‌పై అంతర్జాతీయంగా నిషేధం విధించాలని, అతన్ని ఐరాస ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా వీటో చేసిన సంగతి తెలిసిందే. చైనా చర్య వల్ల పఠాన్‌కోట్, ఉడీ ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన మసూద్ అంతర్జాతీయంగా యథేచ్ఛగా తిరుగుతూ.. భారత్ వ్యతిరేక కార్యకలాపాల కోసం నిధులు సేకరించగలడు. భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు చైనా మసూద్ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఉగ్రవాద నిరోధం విషయంలో ద్వంద్వ వైఖరులు ఉండరాదు. ఉగ్రవాదంపై పోరాటం పేరిట రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదు’ అని చైనా విదేశాంగశాఖ ఉపమంత్రి లీ బావోడాంగ్ సోమవారం విలేకరులతో అన్నారు. మసూద్ విషయంలో భారత్ వైఖరిని పరోక్షంగా నిందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.
మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు ముగియడంతో రెండురోజుల కిందట దానిని ఇంకో ఆరు నెలలు పొడిగించింది. చైనా అభ్యంతరం చెప్పకుంటే భారత్ తీర్మానం దానంతటదే ఆమోదం పొందేది. మరోవైపు అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ స్వభ్యత్వం పై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరిపేందుకు సిద్ధమని చైనా స్పష్టం చేసింది. మసూద్ విషయంలో మాత్రం తమ వైఖరి మారబోదని పేర్కొంది.